‘చావును జయించొచ్చు’
బీజింగ్ : అమెరికా - ఉత్తరకొరియాల సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎప్పుడేం జరుగుతుందో అనే భయాందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఉత్తరకొరియా అత్యంత శక్తిమంతమైన హస్వాంగ్ -15ను పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా కొరియన్ పెనిసులాపై దక్షిణ కొరియా - అమెరికా ‘ఆపరేషన్ ఉత్తరకొరియా’ పేరుతో కనివీనీ ఎరుగని రీతిలో వాయు దళ డ్రిల్‌ను చేపట్టాయి.
దీంతో అణు దాడి గురించి ఉత్తరకొరియాకు చేరువలోని దేశాలు వణికిపోతున్నాయి. కిమ్ దేశానికి చేరువలో ఉన్న దేశాల్లో చైనా కూడా ఒకటి. ఉత్తరకొరియా సరిహద్దులో ఉన్న చైనా రాష్ట్రంలోని ప్రజల్లో అణు దాడి భయాన్ని పొగొట్టేందుకు ఆ రాష్ట్రంలోని ఓ నగరమైన జిలిన్కు చెందిన జిలిన్ డెయిలీ ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
‘కామన్ సెన్స్’ ఉంటే అణు దాడి నుంచి అవలీలగా బయటపడొచ్చని దిన పత్రిక తన కథనంలో పేర్కొంది. పూర్తిగా ఓ పేజీని ఈ స్టోరీకి కేటాయించిన దిన పత్రిక.. సాధారణ ఆయుధాలతో పోలిస్తే అణ్వాయుధాలు ఎలా భిన్నంగా ఉంటాయో తొలుత వివరించింది. అణు దాడి జరిగినప్పుడు ప్రజలు కాలువల్లో దాక్కోవాలని, చర్మం బయటకు కనబడకుండా దుస్తులు ధరించాలని చెప్పింది.
ఇవి కుదరనప్పుడు నదులు, సరస్సుల్లో ఎక్కువ సేపు మునిగి ఉండటం ద్వారా మరణాన్ని జయించొచ్చని తెలిపింది. పత్రికలో ప్రచురించే కార్టూన్‌ను కూడా అణుదాడి నుంచి తప్పించుకోవడం ఎలానో అర్థమయ్యేలా వేశారు. అణుదాడి జరిగినప్పుడు ప్రాణాలు ఎలా పోతాయో వివరించడానికి హిరోషిమా, నాగసాకి ఘటనలను క్లుప్తంగా ప్రస్తావించారు.