హంపీ సౌందర్యం అద్భుతం
సాక్షి, బళ్లారి : హంపిని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సతీమణి కాంచన గడ్కరి సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నం ఆమె జిందాల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న తర్వాత బళ్లారి లోక్సభ మాజీ సభ్యురాలు జె.శాంతతో కలిసి హంపీకి వెళ్లి విరుపాక్షేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పలు పర్యాటక స్థలాలను సందర్శించారు. తర్వాత అంజనాద్రి బెట్టలోని శ్రీఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మహిమాన్వితుడైన శ్రీవిరుపాక్షేశ్వర స్వామిని, అంజనాద్రి కొండను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. హంపి శిల్పకళ అందాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయని, అంజనాద్రి కొండ, హంపి పక్కపక్కనే ఉండటం ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా విరాజిల్లేందుకు దోహదం చేశాయని, ఈ రెండు పవిత్ర పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు విచ్చేసినట్లు పేర్కొన్నారు.