వాటిల్లో జియో ఫోన్ బుకింగ్స్ ప్రారంభం
జీరోకే జియో ఫోన్... ప్రస్తుతం ఫీచర్ ఫోన్ మార్కెట్‌ను ఊరిస్తోన్న డివైజ్. ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు తమ చేతులోకి వచ్చేస్తుందా అంటూ ఎదురుచూడని కస్టమర్లంటూ లేరు. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రెండింట్లోనూ అధికారికంగా ఆగస్టు 24 నుంచి బుకింగ్స్‌ను చేపడతామని ఫోన్ లాంచింగ్ రోజే రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. కానీ ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని కొంతమంది ఆఫ్‌లైన్ రిటైలర్లు 10 రోజుల ముందుగానే ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్లను ప్రారంభించినట్టు గాడ్జెట్స్ 360 రిపోర్టు చేసింది. ఆఫ్‌లైన్ బుకింగ్ ప్రాసెస్‌లో డాక్యుమెంట్లను సమర్పించి, ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని రిటైలర్లు చెబుతున్నట్టు పేర్కొంది.. అయితే ఈ హ్యాండ్‌సెట్‌ను కస్టమర్ల చేతికి అందించేటప్పుడే రూ.1500 రీఫండబుల్ డిపాజిట్‌ను చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. దీంతో ప్రీ-ఆర్డర్ చేసుకునేటప్పుడే ఈ మొత్తాన్ని చెల్లించాల్సినవసరం లేదు.
జియోఫోన్ బుకింగ్ విత్ ఆధార్ నెంబర్:
జియోఫోన్‌ను బుక్ చేసుకునేటప్పుడు, మీ ఆధార్ కార్డును అధికారిక జియో రిటైలర్ వద్ద సమర్పించాల్సి ఉంటుంది. ఈ అధికారిక జియో రిటైలర్ మీ పక్కనున్న స్టోర్ కావచ్చు లేదా రిలయన్స్ జియో అవుట్లెట్ అయినా అయి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా వ్యక్తిగత వినియోగదారులకు ఒక్కో ఆధార్ నెంబర్‌కు కేవలం ఒకే ఒక్క యూనిట్‌ను ప్రీఆర్డర్ చేసుకోవడానికి వీలుంటుంది. వివిధ స్టోర్లలో పలు ఫోన్లను బుక్ చేసుకోవడానికి వీలుండదు. ఆధార్ నెంబర్‌ను సమర్పించాక, జియో సెంట్రలైజడ్ సాఫ్ట్‌వేర్‌లో మీ వివరాలన్నీ నమోదవుతాయి. మీకో టోకెన్ నెంబర్ కూడా అందిస్తారు. ఫోన్‌నే స్వీకరించే ముందు మీరు దాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
జియో డెలివరీ డేట్ :
ప్రస్తుతం జియో ఫోన్ ఆర్డర్‌ను ప్లేస్ చేసిన వారికి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 4 మధ్యలో ఈ ఫోన్‌ను డెలివరీ చేస్తారు. ఒకవేళ బుకింగ్స్‌ను వచ్చే వారాల్లో మరింత ఎక్కువైతే, డెలివరీ తేదీలను పొడిగించే అవకాశముంది. అయితే సెప్టెంబర్‌లో జియో ఫోన్‌ను కస్టమర్ల చేతికి అందిస్తామని తెలిపిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కచ్చితమైన తేదీని వెల్లడించలేదు. వారంలో 50 లక్షల ఫోన్లను డెలివరీ చేయనున్నట్టు మాత్రమే తెలిపారు. మైజియో యాప్ ద్వారా మాత్రం ఆగస్టు 24 నుంచి ఈ హ్యాండ్సెట్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభమవుతున్నాయి.