చెరకు కొనుగోలు పన్ను జీఓ విడుదల
► టన్నుకు 60 రూపాయలు చొప్పున
► చెల్లించాలని ఆదేశం
► రాష్ట్ర వ్యాప్తంగా 35 కోట్లు బకారుులు
► జీఓ రావడంపై రైతుల హర్షం
బొబ్బిలి : చెరకు రైతులకు తీపి కబురు.. గత ఏడాది చెరకు క్రషింగు సీజనుకు సంబంధించి కొనుగోలు పన్నును తిరిగి రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. శుక్రవారం విడుదల చేసిన 394 జీఓ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 23 ఫ్యాక్టరీలకు చెరుకును సరఫరా చేసే రైతులకు రూ.35 కోట్ల వరకూ ఆయా ఫ్యాక్టరీలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో గత ఏడాది 58 లక్షల టన్నుల క్రషింగు చేయగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరపై ఫ్యాక్టరీలు రికవరీని ఆధారంగా చేసుకొని పన్ను చెల్లిస్తుంటారు. చెరకు ఫ్యాక్టరీలు టన్నుకు రూ. 60 లను కొనుగోలు పన్నుగా చెల్లించాలి. అరుుతే ప్రభుత్వం మాత్రం ఆ పన్నును తిరిగి రైతులకే వర్తించేలా ఏటా జీఓ విడుదల చేస్తుంటుంది.
2015- 16 సంవత్సరానికి సంబంధించి చెరకును సరఫరా చేసిన రైతులకు జీఓను సకాలంలో విడుదల చేయకపోవడంతో రైతాంగం ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా సీజను నవంబర్, డిసెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే చెరకు క్రషింగు ప్రారంభమైనా జీఓ రాకపోవడంతో వారంతా ఆందోళన చెందారు. శుక్రవారం ఆ జీఓను ప్రభుత్వం విడుదల చేయడంతో విజయనగరం జిల్లాలో ఉండే లచ్చయ్యపేట, భీమసింగి, శ్రీకాకుళం జిల్లాలోని సంకిలి ఫ్యాక్టరీల పరిధిలోగల దాదాపు 18,500 మంది రైతులకు రూ. 5.90కోట్లు వరకూ అందుతుంది. ఎన్సీఎస్ ఫ్యాక్టరీ పరిధిలో రూ. కోటి 36 లక్షలు, భీమసింగి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 54 లక్షల 5 వేలు, సంకలి ఫ్యాక్టరీ పరిధిలో రూ. 3 కోట్ల 95 లక్షల వరకూ చెల్లింపులు చేయాల్సి ఉంది.