బదిలీల కోసం ప్రయత్నాలు
కీలకపోస్టుల కోసం ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
అరండల్‌పేట (గుంటూరు) : ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు (జీవో నంబర్ 175) జారీ చేసింది. దీంతో ఎప్పటి నుంచో బదిలీలపై ఆశలు పెట్టుకున్న ఉద్యోగులు, అధికారులు తమ ప్రయత్నాలను మమ్మురం చేశారు. ప్రధానంగా జిల్లా పాలనలో కీలక పోస్టుల కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టారు. జిల్లాపరిషత్ సీఈఓ, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఖజానా శాఖ అధికారి, డీటీసీ వంటి పోస్టుల కోసం అనేక మంది అధికారులు ఇప్పటికే తమ పైరవీలను మమ్మురం చేశారు. వీరితో పాటు నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీర్లు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, జీజీహెచ్ సూపరింటెండెంట్, ఇలా కీలక స్థానాల్లో పోస్టింగ్‌ల కోసం జిల్లాకు చెందిన మంత్రుల వద్దకు అధికారు లు క్యూ కడుతున్నారు. గుంటూరు ఆర్డీఓ పోస్టు ఖాళీగా ఉండటంతో చిత్తూరుకు చెందిన ఆర్డీఓకు పోస్టింగ్ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది.
►నరసరావుపేట ఆర్డిఓ తెనాలికి, గుంటూరు ఇన్చార్జి ఆర్డిఓ మురళి గురజాల ఆర్డిఓగా వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
►గుంటూరు తహశీల్దారు పోస్టుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డెల్టాకు చెందిన ఓ తహశీల్దారుకు జిల్లాకు చెందిన మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం.
►నగరపాలక సంస్థకు వచ్చేందుకు అనేక మంది ఇంజినీరింగ్ అధికారులు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం అవసరమైన సిఫార్సు లేఖలను మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పొందారు.
►నగరపాలక సంస్థ తాత్కాలిక కమిషనర్‌గా ఉన్న పి. నాగవేణి సైతం తనను ఇక్కడే ఉంచాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే, మంత్రి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. ఐఏఎస్ అధికారి కావాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకువస్తున్నారు. అదనపు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ల పోస్టుల కోసం ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చేందుకు కొంతమంది అధికారులు ఆసక్తి చూపుతున్నారు.
►వైద్య ఆరోగ్యశాఖలో డిఎం అండ్ హెచ్ఓగా ఉన్న గోపీనాయక్ ధీర్ఘకాలికంగా పని చేస్తుండటంతో ఆయన బదిలీ కావడం ఖాయమైంది. దీంతో ఆయన జీజీహెచ్‌లో ఆర్ఎంఓ లేదా ఆర్డి పోస్టు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
►డిఎం అండ్ హెచ్ఓ పోస్టు కోసం ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు అక్కడి నాయకులతో పైరవీలు చేస్తున్నారు.
►మరో వైపు బదిలీలకు సంబంధించి ఉద్యోగ సంఘాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. విద్యా సంవత్సరం మధ్యలో వేరేప్రాంతానికి వెళితే తమ పిల్లలు ఇబ్బందులు పడతారని వాపోతున్నారు. బదిలీలు కోరుకున్న వారినే పరిగణలోకి తీసుకోవాలి తప్ప, బలవంతంగా బదిలీలు చేయవద్దని ఏపీఎన్జీఓ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.