దేనికైనా కాలం కలిసి రావాలి
దేనికైనా కాలం కలిసిరావాలని అంటుంటారు. అలాగే ఒక్కోసారి ప్రయోగాలు బెడిసికొడుతుంటాయి. ఈ రెండింటిని దర్శకుడు, నటుడు చేరన్కు ఆపాదించవచ్చు. ఒకప్పుడు వరుస విజయాలతో ఓహో అని వెలిగారు. ఈయన చిత్రాలు తెలుగులోనూ పునర్నిర్మాణం, అనువాదాలు జరిగాయి. అలాంటి దర్శకుడు శర్వానంద్, నిత్యామీనన్ జంటగా తెరకెక్కించిన జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రంపై ఆరంభంలో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అయితే కారణాలేమైన చేరన్ ఆ చిత్రాన్ని ఒక ప్రయోగానికి వాడుకున్నారు. అదే చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయకుండా డీవీడీల ద్వారా ఇంటింట విక్రయించారు. ఇలాంటి ప్రయోగాన్నే అంతకు ముందు విశ్వనటుడు కమలహాసన్ విశ్వరూపం చిత్రానికి చేయాలని ప్రయత్నించి థియేటర్ల యాజమాన్యం వ్యతిరేకత కారణంగా దాన్ని విరమించుకోవలసి వచ్చింది.
దర్శకుడు చేరన్ చేసిన ప్రయోగం ఎంత వరకు ఫలించిందోగానీ, ఆయన మాత్రం చాలా ఆర్థిక సమస్యలకు గురయ్యారు.ఈ సంగతలా ఉంచితే జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రం తమిళనాడులో థియేటర్లలోకి రాకుండానే తెలుగులో రాజాధిరాజా పేరుతో అనువాదమై గత శుక్రవారం విడుదలైంది. అక్కడ చిత్రానికి మంచి స్పందన వస్తోందని దర్శకుడు చేరన్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా మొదట తమిళనాడులో డీవీడీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పడు తెలుగులో విడుదలైంది. తదుపరి తమిళంలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చేరన్ తెలిపారు.
జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రాన్ని డీవీడీల ద్వారా కొందరు మాత్రమే చూడగలిగారని, మంచి చిత్రాన్ని అందరూ చూడాలన్న భావనతో థియేటర్ల యాజమాన్యం ప్రదర్శించడానికి ముందుకు రావడంతో జులై 15న చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు చేరన్ వెల్లడించారు. ప్రస్తుతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆయన్ని జేకే ఎనుమ్ నన్బనిన్ వాళ్కై చిత్రం ఒడ్డున పడేస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారు.