కర్నూలును రాజధానిగా ప్రకటించాలి
కర్నూలు(అర్బన్): కర్నూలును రాజధానిగా ప్రకటించాలనే ప్రధాన డిమాండ్‌తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో మంగళవారం వందల సంఖ్యలో విద్యార్థులు జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
సమాఖ్య జిల్లా అధ్యక్షుడు భరత్‌కుమార్ అధ్యక్షతన చేపట్టిన ఆందోళనలో లక్ష్మీనరసింహ మాట్లాడుతు రాష్ట్ర విభజన అనంతరం రాయలసీమకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేస్తూ కర్నూలును రాజధానిగా ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. కమిటీల పేరిట కాలయాపన చేస్తూ రాజధానిని కోస్తాకు తరలించేందుకు ప్రయత్నిస్తే ఊరుకునేది లేదన్నారు. రాయలసీమకు చెందిన ప్రజాప్రతినిధులు పదవుల కోసం పాకులాడుతున్నారే తప్ప రాయలసీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు.
57 సంవత్పరాల సమైక్యాంధ్రలో రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు అయ్యారని, వీరంతా సీమ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రాయలసీమ ప్రజలు తాగు, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఉన్నత విద్యను అభ్యసించిన ఎంతో మంది నిరుద్యోగులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకొని వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో పాలకుల పుణ్యమాని రైతులకు రుణాలు అందడం లేదని, రుణమాఫీపై చంద్రబాబు స్పష్టత ఇవ్వకపోవడంతో రైతుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయన్నారు.
రాయలసీమ అభివృద్ధి రాజధానితోనే సాధ్యమని, అన్ని రకాల వనరులు కర్నూలు జిల్లాలో ఉన్నప్పటికీ కమిటీల పేరిట ఎందుకు కాలయాపన చేస్తున్నారని లక్ష్మీనరసింహ ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి అంతర్జాతీయ మెట్ట పొలాల పరిశోధన సంస్థ, ఐటీ హబ్, నిట్, నిమ్స్, సెంట్రల్ యూనివర్సిటీ, మైనింగ్ స్కూల్, పరిశ్రమల ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు పార్టీలకు అతీతంగా నాయకులు కలసిరావాలని ఆయన కోరారు.
రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధానికి గుంటూరు-విజయవాడ అనుకూలంగా ఉంటుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని సోమిశెట్టి హామీ ఇచ్చారు. ఆందోళనలో విద్యార్థి నాయకులు నాగభూషణం, నరసింహ, వినయ్, నగర నాయకులు షఫీ, మాబాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు.