JMM candidates
-
జేఎంఎం అభ్యర్థుల జాబితాలు విడుదల
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్‌గంజ్ జిల్లాలోని బర్హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే. హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు. జార్ఖండ్‌లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు. -
జార్ఖండ్ కొత్త సీఎంగా చంపై సొరెన్
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చంపై సొరెన్ నియమితులు కానున్నారు. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిశారు చంపై సొరెన్. హేమంత్ సొరెన్‌పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్. చంపై సొరేన్ జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా ఉన్నారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ కృషి చేశారు. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నూతన సీఎంగా చంపై సొరెన్‌ను ఎన్నుకున్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు. ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సొరెన్ మొదట్లో ఆయన భార్య కల్పనా సోరెన్ నూతన సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ కల్పనా సొరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అటు ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కల్పనా సొరెన్‌కు సీఎం పదవి ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది. ఇదీ చదవండి: ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్ -
కేంద్ర మంత్రికి నల్లజెండాలతో జేఎంఎం నిరసన
రాంచీ: ప్రధాని సమక్షంలో తమ నేతకు జరిగిన అవమానానికి నిరసనగా జేఎంఎం కార్యకర్తలు అన్నంత పని చేశారు. శనివారం జార్ఖండ్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు రెండు సార్లు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. రెండు రోజుల క్రితం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎదుటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని క్షమాపణలు చెప్పే వరకు రాష్ట్రానికి వచ్చే కేంద్ర మంత్రులకు నిరసన తెలుపుతూనే ఉంటామని జేఎంఎం నేతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం రాంచీ విమానాశ్రయం చేరుకున్న కేంద్ర మంత్రి తోమర్ ఎదుట నిరసన తెలిపారు. తన కాన్వాయ్‌లో వెళుతున్న తోమర్‌కు జేఎంఎం కార్యకర్తలు నల్లజెండాలు చూపారు. తర్వాత జంషెడ్‌పూర్‌లోనూ ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమ వేదిక వెలుపల కూడా ఇదే పని చేశారు. కాగా, రాంచీ విమానాశ్రయం వద్ద బీజేపీ, జేఎంఎం కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ కూడా జరిగింది. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. నిజానికి తోమర్ ఎదుట నిరసన తెలిపేందుకు జేఎంఎం కార్యకర్తలు పెద్ద సంఖ్యలోనే విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం షెడ్యూల్ కంటే గంట ఆలస్యంగా రావడంతో అప్పటికే చాలా మంది కార్యకర్తలు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తే ప్రమాదం తప్పిందని పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.