బర్‌హేట్ నుంచి హేమంత్ సోరెన్ పోటీ
రాంచీ: జార్ఖండ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) బుధవారం 35 మంది పార్టీ అభ్యర్థుల పేర్లతో రెండు జాబితాలను విడుదలచేసింది. జేఎంఎం చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సొంత నియోజకవర్గమైన సహీబ్‌గంజ్ జిల్లాలోని బర్‌హేట్(ఎస్టీ) నుంచి, ఆయన భార్య కల్పన గాండేయ్ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు. కల్పన గతంలో గాండేయ్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిపై భారీ మెజారిటీ గెలవడం తెల్సిందే.
హేమంత్ సోదరుడు బసంత్ ఈసారి దుమ్కా నుంచి, అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో నాలా నుంచి, మంత్రి మిథిలేశ్ ఠాకూర్ గర్వా నుంచి పోటీచేస్తున్నారు. మూడుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల జేఎంఎంలో చేరిన కేదర్ హజారా ఈసారి జమూనా(ఎస్సీ) నుంచి పోటీచేస్తున్నారు. రాజ్యసభ సభ్యురాలు మహువా మాఝీ రాంచీ నుంచి పోటీచేయనున్నారు.
జార్ఖండ్‌లో విపక్షాల ‘ఇండియా’ కూటమి భాగస్వామ్యులైన జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల మధ్య ఇప్పటికే సీట్ల సర్దుబాటు జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్, జేఎంఎం 70 చోట్ల పోటీచేస్తాయి. 11 చోట్ల ఆర్జేడీ, వామపక్ష పార్టీలు పోటీచేస్తాయి. ఆర్జేడీ మంగళవారం ఆరుగురి పేర్లను ప్రకటించింది. విపక్ష బీజేపీ 68 స్థానాల్లో బరిలో దిగనుంది. మిత్రపక్షాలైన ఏజేఎస్‌యూ 10, జేడీ(యూ) రెండు, ఎల్‌జేపీ(రాంవిలాస్) ఒక స్థానంలో బరిలోకి దిగనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఫలితాలను వెల్లడిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment