రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి నుంచి హేమంత్ సొరెన్ తప్పుకున్నారు. నూతన సీఎంగా చంపై సొరెన్ నియమితులు కానున్నారు. చంపై సొరెన్‌ను తదుపరి సీఎంగా ఎన్నుకున్నట్లు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్‌ను కలిశారు చంపై సొరెన్. హేమంత్ సొరెన్‌పై ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) పార్టీ ప్రారంభించినప్పటి నుండి హేమంత్ సోరెన్ తండ్రి శిబు సోరెన్‌తో కలిసి పనిచేసిన సీనియర్ నాయకుడు చంపై సోరెన్. చంపై సొరేన్ జార్ఖండ్ రవాణా శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిగా కూడా ఉన్నారు. సరైకేలా-ఖర్సావాన్ జిల్లాకు చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు చంపై సొరెన్. హేమంత్ సొరెన్ కుటుంబానికి బాగా సన్నిహితుడు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కూడా చంపై సొరెన్ కృషి చేశారు.
భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. అంతకుముందే సీఎం పదవికి హేమంత్ సొరెన్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. నూతన సీఎంగా చంపై సొరెన్‌ను ఎన్నుకున్న జేఎంఎం, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలు గవర్నర్ నివాసానికి వెళ్లారు.
ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సొరెన్ మొదట్లో ఆయన భార్య కల్పనా సోరెన్ నూతన సీఎంగా ఎన్నికవుతారని అందరూ భావించారు. కానీ కల్పనా సొరెన్ ఎమ్మెల్యేగా ఎన్నిక కాలేదు. అటు ఈ ఏడాది నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కల్పనా సొరెన్‌కు సీఎం పదవి ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది.
ఇదీ చదవండి: ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం సొరెన్
Comments
Please login to add a commentAdd a comment