వచ్చే నెలలో జ్ఞానసాయి లివర్ మార్పిడి
చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలం బత్తలాపురానికి చెందిన చిన్నారి జ్ఞానసాయి కాలేయ మార్పిడికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొమ్మిది నెలల ఈ బాలిక కోసం ఆమె తండ్రి రమణప్ప తన కాలేయ దానానికి అనుమతి కోరుతూ బుధవారం తంబళ్లపల్లె కోర్టులో దరఖాస్తు చేశారు. ఇందుకు కోర్టు అఫిడివిట్ మంజూరు చేసింది.
జ్ఞానసాయి ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. తండ్రి రమణప్ప కాలేయం చిన్నారికి సరిపోయినట్లు అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించి తెలిపినట్లు సమాచారం. ఇందులో భాగంగా 2011 శస్త్ర చికిత్స సవరణ చట్టం ప్రకారం ఒక వ్యక్తి అవయవాలు మరో వ్యక్తికి దానం చేయడం కోసం స్థానికంగా ఉండే కోర్టులో అనుమతి పొందాలి. శస్త్ర చికిత్స కోసం చెన్నై గ్లోబల్ హాస్పిటల్ యజమాన్యం కోర్టులో అనుమతి పొందడం కోసం కొన్ని పత్రాలను చిన్నారి కుటుంబ సభ్యులకు ఇచ్చారు. పత్రాలతో బుధవారం చిన్నారి కుటుంబ సభ్యులు తంబళ్లపల్లె కోర్టులో అఫిడవిట్ మంజూరు కోసం కోర్టుకు విన్నవించారు. జడ్జి వాసుదేవ్ అనుమతి ఇస్తూ అఫిడవిట్‌ను మంజూరు చేశారు.
ఆగస్టు మొదటి వారంలో శస్త్ర చికిత్స...
చిన్నారి జ్ఞానసాయి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్నట్లు గ్లోబల్ హాస్పిటల్ వైద్యులు తెలిపినట్లు చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసి చిన్నారి తల్లీదండ్రులతో సమావేశం నిర్వహించనున్నారు. కమిటీ శస్త్ర చికిత్స తేదీని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతుందన్నారు.