కొలువు ఫలాల కల్పతరువు
క్యాంపస్ ఇంటర్వ్యూల్లో జేఎన్టీయూకే ముందంజ
అగ్రశ్రేణి సంస్థల్లో ఉద్యోగాలు సాధిస్తున్న విద్యార్థులు
తాజాగా టీసీఎస్ సంస్థకు 207 మంది ఎంపిక
బాలాజీచెరువు (కాకినాడ):
ఐటీ బూమ్, మాంద్యంలతో సంబంధం లేకుండా ప్రారంభించిన నాటి నుంచి గణనీయంగా ప్లేస్మెంట్లు కల్పిస్తూ ‘కొలువుల కల్పతరువు’గా ఖ్యాతినార్జించింది జేఎన్టీయూ కాకినాడ ఇంజనీరింగ్ కళాశాల. కళాశాలలో గత వారం రోజులుగా ప్రముఖ మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ సంస్ధ టీసీఎస్ నిర్వహిస్తున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు శుక్రవారంతో ముగిశాయి. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లతో పాటు ఎంటెక్, ఎంఎస్‌ఐటీ, ఐఎస్టీ కోర్సు విద్యార్థులకు ఈ నెల ఒకటి నుంచి క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. ముందుగా రాతపరీక్ష నిర్వహించి, ఎంపికైన వారికి టెక్నికల్ రౌండ్ అనంతరం ఫైనల్‌గా గురు, శుక్రవారాల్లో హెచ్ఆర్ ఇంటర్వ్యూ నిర్వహించి బీటెక్ నుంచి 146 మందిని, ఎంటెక్ నుంచి 61 మందిని ఎంపిక చేశారు. బీటెక్ విద్యార్థులకు రూ.3.30 లక్షలు, ఎంటెక్ విద్యార్థులకు రూ.3.50 లక్షల వార్షిక వేతనం అందజేయనున్నారు.వీరిలో ఒకరు డిజిటల్ ఇంటర్వ్యూకు ఎంపికైయ్యారు.
ఎంఎస్‌ఐటీ విద్యార్థుల హవా
మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్‌ఐటీ) కోర్సు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 19 మంది పరీక్షకు హాజరవగా 14 మంది ఎంపికయ్యారు. రెండు సంవత్సరాల వ్యవధిగల ఎంఎస్‌ఐటీ కోర్సును అమెరికాలోని కార్నెగీ మెల్లాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
టీసీఎస్‌లో విజయం సాధించా..
నూజీవీడు సారథి ఇన్స్టిట్యూట్లో ఈసీఈ విభాగంలో ఇంజనీరింగ్ చదివాను. ఎంఎస్‌ఐటీ కోర్సు పూర్తిగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినది. కోర్సు ద్వితీయ సంవత్సర మెుదటి నెలలోనే టీసీఎస్‌కు ఎంపికవడం సంతోషంగా ఉంది.
–తలాటం కొండబాబు, ఎంఎస్‌ఐటీ ద్వితీయ సంవత్సరం
క్యాంపస్ ఇంటర్వ్యూలకు తగ్గ శిక్షణ
ఈ కోర్సు పూర్తిగా క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించేలా రూపకల్పన చేయబడింది. సిలబస్‌లో 90 శాతం ప్రాక్టికల్స్‌కు, పదిశాతం మాత్రమే థియరీకి కేటాయించారు. ఈ కోర్సును అభ్యసించిన విద్యార్థులకు నూరుశాతం ఉపాధి తప్పకుండా వస్తుంది.
– కె.సంతోషి ప్రియాంక, ఎంఎస్‌ఐటీ ద్వితీయ సంవత్సరం
ఫ్యాకల్టీ శిక్షణతో విజయం
ఇప్పుడు అభ్యసిస్తున్న కోర్సు పూర్తిగా సాఫ్ట్వేర్రంగానికి సంబంధించినది. ఫ్యాకల్టీలంతా వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వారి సూచనలు, శిక్షణ వల్లే విజయం సాధిచడం సులభమౌతుంది.
– వి.సాయి అలేఖ్య, ఎంఎస్‌ఐటీ
డిజిటల్ ఇంటర్వ్యూలో విజయం సాధించా..
టీసీఎస్ నిర్వహించిన డిజిటల్ ఇంటర్వ్యూలో విజయం సాధించి రూ.6.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాను. బీటెక్ సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. కోర్సు పూర్తవకుండానే ఉపాధి పొందడం చాలా సంతోషంగా ఉన్నది. అధ్యాపకుల సహకారం మరువలే నిది.
–పి.బాల గణేష్, సీఎస్ఈ నాలుగో సంవత్సరం
ప్రాక్టికల్ నాలెడ్జ్‌కే ప్రాధాన్యం
సిలబస్‌లో బీటెక్ తరహాలో పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కేవలం ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాము. థియరీకి గంట మాత్రమే కేటాయించి, మిగతా సమయంలో పోగ్రామింగ్స్కు ప్రాధాన్యమివ్వడం వల్లే విద్యార్థులు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించగలుగుతున్నారు.
–డాక్టర్ ఎం.సహదేవయ్య, ఎంఎస్‌ఐటీ కో ఆర్డినేటర్
నూరుశాతం ఉపాధి కల్పనే లక్ష్యం
జేఎన్టీయూకేలో విద్యను అభ్యసించే బీటెక్, ఎంటెక్, ఎంఎస్‌ఐటీ అభ్యర్థులకు నూరుశాతం ఉపాధి కల్పనే ధ్యే్యయంగా జేఎన్టీయూకే వీసీ,రిజిస్ట్రార్, అధ్యాపకుల సహకారంతో కృషిచేస్తున్నాం. విద్యార్థుల గ్రూప్ డిష్కషన్లు, ప్రెజెంటేషన్లు, రైటింగ్ అసైన్మెంట్లు, కామర్స్ స్పెషలైజేషన్‌లో మొబైల్ అప్లికేషన్స్ శిక్షణతో పాటు డేటా ఎనలిటిక్స్ డొమైన్స్ పై శిక్షణ ఇవ్వడంతో ఉద్యోగాల సాధన సులభతరమౌతుంది. వచ్చేవారంలో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉన్నాయి.
–డాక్టర్ జి.విఆర్.ప్రసాద్‌రాజు, జేఎన్టీయూకే ప్రిన్సిపాల్
జేఎన్టీయూహెచ్ కన్నా ఎక్కువ ప్లేస్మెంట్లు
జేఎన్టీయూకేలో చదివిన ప్రతి విద్యార్థికీ కోర్సు పూర్తయ్యే లోపే ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా వర్సిటీ అధికారులు, అధ్యాపకులు కృషి చేస్తున్నారు.ప్లేస్మెంట్ ఆఫీస్ ద్వారా ఈ నెలలో, అక్టోబర్‌లో మరిన్ని కంపెనీలు ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉన్నాయి. పలువురు జాతీయ స్థాయి కంపెనీకి ఎంపికై జేఎన్టీయూకే ప్రతిష్ట నిలిపారు. ఈ సంవత్సరం జేఎన్టీయూ హైదరాబాద్ కంటే కాకినాడ వర్సిటీలో ఎక్కువ ప్లేస్మెంట్ అవడం గర్వంగా ఉన్నది.
–ఎస్.చంద్రశేఖర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, జేఎన్టీయూకే