ఉద్యోగ నియామకాలు 18 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: గత నెల మార్చిలో ఉద్యోగ నియామకాల వృద్ధి 18 శాతంగా నమోదైంది. ఉద్యోగ నియామకాలు ఐటీ, టెలికం రంగాల్లో అత్యధికంగా ఉన్నాయని టైమ్స్జాబ్స్.కామ్ పేర్కొంది. ఐటీ, టెలికం రంగాలలో నిపుణుల డిమాండ్ 31 శాతం పెరిగినట్లు తెలిపింది. పెట్రో కెమికల్స్, ఆయిల్, గ్యాస్, పవర్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలలో ఉద్యోగ నియామకాల వృద్ధి 16-19 శాతంగా ఉన్నట్లు పేర్కొంది.
బహుళ అంతర్జాతీయ కంపెనీల దృష్టిని భారత ఆర్థిక వృద్ధి ఆకర్షించిందని, ఇది నిపుణుల డిమాండ్ పెరగడానికి దోహదపడిందని టైమ్స్జాబ్స్. కామ్ సీఓఓ వివేక్ మధుకర్ అన్నారు. టైమ్స్జాబ్స్ నివేదిక ప్రకారం గత నెల మార్చిలో టైర్-2, టైర్-3 పట్టణాలలో ఉద్యోగ నియామకాలు బాగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రారంభ స్థాయి ఉద్యోగులు, అనుభవం ఉన్న పాలనా సిబ్బంది డిమాండ్ 19 శాతం పెరిగింది.