అధ్యాపకులకూ రెండేళ్ల పెంపు!
యూనివర్సిటీక్యాంపస్ : రాష్ట్రంలోని యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును ప్రభుత్వం 60 నుంచి 62ఏళ్లకు పెంచింది. దీనికి సంబంధించిన జీవో ఎంఎస్ నెం.59ని బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. ఈ జీవో జూన్ 2 నుంచి అమలులోకి రానుం ది. ఫలితంగా జూన్ 2 తర్వాత ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు తిరిగి విధుల్లో చేరనున్నారు.
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక జూన్ 9న చంద్రబాబునాయుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతూ సంబంధిత ఫైల్‌పై సంతకం పెట్టారు. దీంతో 60 సంవత్సరాల ఉద్యోగ విరమణ వయస్సు కలిగిన యూనివర్సిటీ అధ్యాపకులు తమకు రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేశారు. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గుంటూరులో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచుతామని ప్రకటించారు.
తాజాగా ఈనెల 18న జరిగిన మంత్రి మండలి సమావేశంలో యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు రెండేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా జీవోనెం.59ని ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. అయితే ఈ జీవో అమలును ఆయా విశ్వవిద్యాల యాల సమావేశాల్లో చర్చించి అమలు చేయాలని ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లకు సూచించారు. యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచడం వల్ల జిల్లాలో 600 మంది అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది.
జిల్లాలో అతిపెద్దదైన ఎస్వీయూలో 300 మంది అధ్యాపకులు ఉన్నారు. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వందమంది, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో 80 మంది, వెటర్నరీ యూనివర్సిటీ, వ్యవసాయ కళాశాలలో కలిపి సుమారు 120 మంది అధ్యాపకులు ఉన్నారు. వీరందరి ఉద్యోగవిరమణ వయస్సు రెండు సంవత్సరాలు పెరిగింది. యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62కు పెంచడంపట్ల ఎస్వీయూ అధ్యాపక సంఘం కార్యదర్శి డాక్టర్ ఎం.రెడ్డిభాస్కర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
తిరిగి రానున్న మాజీలు
అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంచారు. ఈ జీవోను జూన్ 2 నుంచి అమలులో కి వస్తుంది. దీనిద్వారా జూన్ 2 తర్వాత రిటైర్డ్ అయిన వారు తిరిగి విధుల్లోకి రానున్నారు. జూన్ 2 నుంచి ఇప్పటి వరకు ఎస్వీయూలో 25 మంది అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేశారు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లో మరో ఐదుగురు రిటైర్డ్ అయ్యారు. తాజా జీవోతో వీరందరూ మళ్లీ విధుల్లోకి రానున్నారు. వారు రిటైర్డ్ అయినప్పటి నుంచి ఈ జీవో విడుదలయ్యే సమయానికి విధులు నిర్వర్తించని కాలాన్ని అసాధారణ సెలవుకింద పరిగణించనున్నారు.