డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే మేనల్లుడు
జైపూర్: జోధ్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే దంపతులు పోలీస్‌స్టేషన్‌లో ధర్నాకు దిగారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా దొరికిన తన మేనల్లుడిని విడిచిపెట్టాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జోధ్‌పూర్‌లో గత ఆదివారం పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో స్థానిక ఎమ్మెల్యే మీనాకున్వార్ మేనల్లుడు అధిక మోతాదులో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో యువకుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే మీనా కున్వార్, తన భర్త ఉమైద్ సింగ్‌తో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నేలపై కూర్చోని నిరసనకు దిగారు. అంతటితో ఆగకుండా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ‘పిల్లలు కొన్ని సందర్భాల్లో తాగుతారు.. అది పెద్ద విషయంకాదన్నారు.. ’తమ మేనల్లుడిని విడిచిపెట్టాలని కోరారు.
ఒక ఎమ్మెల్యేకు సరైన గౌరవం ఇవ్వడం లేదని స్టేషన్ అధికారిపై మండిపడ్డారు. ఈ క్రమంలో మానవత్వంతో మాట్లాడాలని సదరు పోలీసు అధికారి కోరారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో.. ఇప్పటికే కొంత మంది అధికారులు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిపోయిన విషయం గుర్తుంచుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, చివరకు డీసీపీ అధికారి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారు. గత ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: భారీ ప్రవాహంలో చిక్కుకున్న కారు.. వీడియో వైరల్