జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రాంబో’ యాక్షన్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించనవసరంలేదు. సిల్వెస్టర్ స్టాలోన్ను హాలీవుడ్ సూపర్ స్టార్ చేసిన సినిమాలు అవి. రాంబో పాత్రను స్టాలోన్ మొదటిసారి పోషించిన చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’. 1982లో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో ఆయన చేసిన పోరాట దృశ్యాలు చూసి, ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఈ చిత్రానికి లభించిన ఆదరణతో ఆ తర్వాత మరో మూడు రాంబో సిరీస్ చిత్రాల్లో నటించారు స్టాలోన్. ఆ విధంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్లు వచ్చాయి. నాలుగోది 2008లో విడుదలైంది.
ఈ నాలుగు రాంబో చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదోసారి రాంబోగా కనబడటానికి స్టాలోన్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు స్క్రీన్ప్లే కూడా ఆయనే సమకూరుస్తున్నారు. మొదటిసారి జాన్ రాంబో పాత్ర చేసినప్పుడు స్టాలోన్ వయసు దాదాపు 36 ఏళ్లు. ఇప్పుడాయన వయసు 67. మరి.. ఈ వయసులో పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయం స్టాలోన్కి తెలియకేం కాదు. కానీ, తన అభిమానులను నిరుత్సాహపరచకూడదనే పట్టుదలతో ఈ సినిమా కోసం వర్కవుట్లు చేస్తున్నారట స్టాలోన్.