ఒలంపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించాలి
కడప స్పోర్ట్స్ :
ఒలంపిక్స్‌కు ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారులు చక్కటి ఆటతీరును కనబరచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్వేత తెవతీయ అన్నారు. మంగళవారం ఇక్కడి వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పోటీలకు ఆమె హాజరై పలువురు క్రీడాకారులతో మాట్లాడారు. రాబోయే కాలంలో జిల్లా నుంచి కూడా ఒలంపిక్‌లో పాల్గొనేలా ఈ క్రీడాపోటీలు స్ఫూర్తినిస్తాయన్నారు. కడపలో ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రోజురోజుకీ బ్యాడ్మింటన్ క్రీడకు ఆదరణ పెరుగుతోందన్నారు. నాణ్యమైన ఆటతీరును కనబరిచి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలని సూచించారు. జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్. జిలానీబాషా మాట్లాడుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే కడపకు చేరుకున్నారన్నారు. 15, 16 తేదీల్లో క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లు, 17 నుంచి 20వ తేదీ వరకు మెయిన్ డ్రా మ్యాచ్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టర్ కె.వి. సత్యనారాయణ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ టోర్నీ విజయవంతం చేయడంలో మార్గదర్శనం చేస్తున్నారన్నారు. అంతకు ముందు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులతో జేసీ మాట్లాడి వారి మనోగతాన్ని తెలుసుకున్నారు. కొద్దిసేపు బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. అనంతరం జేసీ క్రీడాకారులకు అందించే సౌకర్యాలను పరిశీలించారు. డీఎస్డీఓ లక్ష్మినారాయణశర్మ, ఎస్ఎస్ఏ పీఓ వెంకటసుబ్బయ్య, సీపీఓ తిప్పేస్వామి, చీఫ్ రెఫరీ బ్రిజేష్‌గౌర్, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి నాగరాజు, ఉపాధ్యక్షులు శశిధర్‌రెడ్డి, సంజయ్ కుమార్‌రెడ్డి, మునికుమార్‌రెడ్డి, బాలగొండ గంగాధర్, సంయుక్త కార్యదర్శులు రెడ్డి ప్రసాద్, సభ్యులు రవిశంకర్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.