15లోగా రుణాల రీషెడ్యూల్ పూర్తి చేయాలి
వ్యవసాయ శాఖ జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్
సదాశివపేట: ఈనెల 15వ తేదీలోగా రైతు రుణాల రీ షెడ్యూల్ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరక్టర్ హుక్యా నాయక్, అడిషనల్ లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం. రఘురాములు బ్యాంకు మేనేజర్లకు అదేశించారు. శనివారం పట్టణంలోని ఎస్బీఐ, ఏపీజీవీబీ బ్యాంకును సందర్శించిన అనంతరం వారు ఆయా బ్యాంకుల మేనేజర్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈనెల 15లోగా రైతులు తాము రుణాలు తీసుకున్న బ్యాంకుల వద్దకు వెళ్లి సంతకం పెట్టి రుణాలను రీషెడ్యూలు చేయించుకోవాలన్నారు. బ్యాంకు అధికారులు ప్రభుత్వానికి సహకరించి 15లోగా రైతు రుణాలను రీ షెడ్యూల్ చేయాలన్నారు.
రీ షెడ్యూల్‌కు నోడ్యూస్ ధ్రువీకరణ పత్రం తేవాలని బ్యాంకు అధికారులు చెబుతున్నారని రైతులు హుక్యానాయక్‌కు ఫిర్యాదు చేయగా రెన్యువల్‌కు, రీ షెడ్యూల్‌కు నోడ్యూస్ సర్టిఫికెట్ అవసరం లేదని జేసీ సూచించారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆదేశాను సారం ఏప్రిల్ 2013 నుంచి అక్టోబర్ 31 వరకు రుణాలు తీసుకున్న రైతులే రీ షెడ్యూల్‌కు అర్హులన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ మేనేజర్ సాయి, ఎపీజీవీబీ బ్యాంకు మేనేజర్ మూర్తి, మండల వ్యవసాయాధికారి బాబూ నాయక్, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.