ఖాయమైన హైకోర్టు విభజన
హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు విభజన ఖాయమైంది. కేంద్రం హైకోర్టు విభజనకు సానుకూలంగా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దత్తు విభజనకు సుముఖంగా ఉండటంతో, సర్వోన్నత న్యాయస్థానం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన వెంటనే విభజన ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నాలుగు నుంచి ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. విభజన ప్రక్రియ ప్రారంభమైన వెంటనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు ఇక్కడకు వచ్చి, హైకోర్టు విభజనకు సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేసి సుప్రీంకు సమర్పిస్తారు.
ఈ నివేదికపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు కమిటీ చర్చించి నిర్ణయం తీసుకుని, దాన్ని కేంద్రానికి పంపుతుంది. అప్పుడు కేంద్రం విభజనను ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యేందుకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. విభజన తరువాత కూడా ఏపీ హైకోర్టు ఇప్పుడున్న చోటే కొనసాగవచ్చునని చెబుతున్నారు. తెలంగాణ హైకోర్టును మరో చోటుకు మార్చే అవకాశం ఉంది. అయితే ఈ పరిణామాన్ని టి. న్యాయవాదులు ఎంత వరకు స్వాగతిస్తారన్న విషయంపై సందేహాలు నెలకొని ఉన్నాయి.