ఎన్టీపీసీ నేడు ‘గుర్తింపు’ ఎన్నికలు
జ్యోతినగర్ : ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు గుర్తింపు సంఘం ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. గతంలో కార్మిక శాఖ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగేవి. ప్రస్తుతం ఎన్టీపీసీ యాజమాన్యం స్వీయపర్యవేక్షణలో నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్(ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ డెమోక్రటిక్ ఎంప్లాయిస్ యూనియన్(హెచ్ఎంఎస్), ఎన్టీపీసీ కార్మిక సంఘ్(బీఎంఎస్), ఎన్టీపీసీ తెలుగునాడు ఎంప్లాయీస్ యూనియన్(టీఎన్టీయూసీ), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), తెలంగాణ ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్, ఎన్టీపీసీ తెలంగాణ కార్మిక సంఘం అర్హత పొందాయి. పోటీలో ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్(ఐక్యఫ్రంట్), బీఎంఎస్, ఎన్టీకేఎస్ యూనియన్లు ఉన్నాయి. ఐఎన్టీయూసీకి ఐక్యఫ్రంట్ గట్టి పోటీ ఇస్తోంది.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఎన్టీపీసీ రామగుండం యాజమాన్యం నిర్వహిస్తున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొదటి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించేందుకు ఏర్పాట్లు చేశారు. 693 మంది ఓటర్లు ఉన్నట్లు ప్రకటించారు. పోలింగ్ కోసం రెండు కౌంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి బూత్‌లో 1 నుంచి 350 మంది, రెండవ బూత్‌లో 351 నుంచి మిగతా ఓటర్లు ఓటు వేసేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం. ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 3:30 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను విడుదల చేస్తారు.