పాకిస్థాన్‌లో రష్యా దళాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్, రష్యాల బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరుదేశాలు సంయుక్తంగా 'ఫ్రెండ్ షిప్ 2016' పేరుతో సంయుక్త డ్రిల్‌ను నిర్వహించనున్నాయి. ఇందుకోసం రష్యా దళాలు శుక్రవారం పాకిస్థాన్ చేరుకున్నాయి. రేపటి నుంచి ఈ డ్రిల్ ప్రారంభం కానుంది. ఇందులో ఇరుదేశాల నుంచి 200 మంది సైనికులు పాల్గొంటారని, పాక్ తో సైనిక విన్యాసం కొనసాగించడం ఇది మొదటి సారని రష్యా మిలిటరీ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
రెండు వారాలపాటు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి.గత పదిహేనేళ్లలో పాకిస్థాన్ ఆర్మీ అధికారులు రష్యాలో పర్యటించి ఎమ్ఐ35 యుద్ధ విమానాలను కొనుగోలు చేసే ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఎస్యు ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు కూడా పాక్ ప్రయత్నం చేస్తోందని అక్కడి మీడియా వెల్లడించింది.