ఎక్కువ మంది పిల్లల్ని కనండి
హిందువులకు వీహెచ్పీ పిలుపు
ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవాలని డిమాండ్
న్యూఢిల్లీ: దేశ జనాభాలో ఏర్పడుతున్న అసమతౌల్యాన్ని సరిదిద్దేందుకు ఉమ్మడి పౌరస్మృతిని వెంటనే తీసుకురావాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) డిమాండ్ చేసింది. దేశంలోని హిందువులంతా ముస్లింల మాదిరే ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చింది. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉన్న దేశంగా భారత్ నిలుస్తుందన్న పలు అంచనాల నేపథ్యంలో... వీహెచ్పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ శనివారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.
హిందువులు ఒకరికన్నా ఎక్కువ మంది పిల్లలను కనాలన్న వీహెచ్పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ వ్యాఖ్యలపై లౌకికవాదులు రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ‘దేశంలో జనాభా అసమతౌల్యాన్ని సరిదిద్దడానికి రెండే మార్గాలున్నాయి. అవి హిందువులు తమ జనాభాను పెంచుకోవడం లేదా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయడం. ఇన్నాళ్లూ దేశాన్ని సెక్యులరిజం పేరిట తప్పుదోవ పట్టించారు. దేశం మొత్తం కశ్మీర్లాగానో, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్లాగానో చేయాలని సెక్యూలరిస్టులు కోరుకుంటున్నారా?.. ఉమ్మడి పౌరస్మృతి తేవాలనేది పూర్తిగా సెక్యులర్ డిమాండ్.
ఇది ఎవరికైనా మతవాదంగా కనిపిస్తే.. వారే పూర్తిస్థాయి మతవాదుల కింద లెక్క. అలాంటివారు దేశం విడిచి పాకిస్తాన్కు వెళ్లిపోవచ్చు..’ అని జైన్ పేర్కొన్నారు. ముస్లింల తరహాలోనే హిందువులు కూడా వీలైనంత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాలయం నిర్మించడానికి ఉన్న అడ్డంకులను త్వరగా తొలగించాలని.. ఇంకా జాప్యం చేస్తే హిందువుల్లో సహనం నశిస్తుందని అన్నారు. కాగా ఇతర మతాల్లో ఉన్నవారిని హిందూమతంలోకి తీసుకొచ్చే ‘ఘర్ వాపసీ’ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.