Joint Staff Council
-
‘కాంట్రాక్ట్ ఉద్యోగులందరి రెగ్యులర్‌కు ఒకే జీవో ఇస్తామన్నారు’
తాడేపల్లి: కాంట్రాక్ట్ ఉద్యోగులందరి రెగ్యులర్‌కు ఒకే జీవో ఇస్తామని సీఎస్ తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ 460 డిమాండ్ లలో 332 డిమాండ్ లు పరిష్కారం అయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరి రెగ్యులర్ కు ఒకే జీవో ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్ లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్ టు జిపిఎస్ గతంలో కంటే బాగుందని సమర్థించాం. జిపిఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం.. అందుకు సీఎస్ అంగీకరించారు. జగన్న లే అవుట్ లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వాటర్స్ లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు ప్రభుత్వ స్కీంలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరాం... అందుకు సైతం సీఎస్ అంగీకరించారు’ అని తెలిపారు. -
సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, అమరాతి: ప్రభుత్వ ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో వారు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లతో ఉద్యోగ సంఘాలు చర్చించిచాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పీఆర్సీ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామని మీడియాతో ఆయన చెప్పారు. ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు త్వరలో పూర్తిగా చెల్లిస్తామని అధికారులు చెప్పారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. వచ్చే సమావేశానికి పీఆర్సీ నివేదికతో రావాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. కాగా, గతనెల 29న చీఫ్‌సెక్రటరీ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు మరోసారి భేటీ అయ్యారు. -
ఇక ఒకటే గుర్తింపు సంఘం!
ఉపాధ్యాయ సంఘాలపై సర్కార్ దృష్టి ♦ బడులను వదిలి కార్యాలయాల చుట్టూ నేతల ప్రదక్షిణలు ♦ విద్యా శాఖలోనే ఇన్ని సంఘాలు ఎందుకు? ♦ తగ్గించే యోచనలో ప్రభుత్వం ♦ ఆర్టీసీ తరహా గుర్తింపు సంఘం విధానం తెద్దామా? ♦ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని సంఘాలే ప్రాతినిధ్యం వహించేలా చేద్దామా? సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో ముందుండాల్సిన ఉపాధ్యాయ సంఘాల నేతలే పాఠశాలలకు దూరమయ్యారు. కొన్ని సంఘాల నేతలు రాష్ట్ర స్థాయిలో ఆన్‌డ్యూటీ సదుపాయంతో విద్యారంగ సమస్యలపై తిరుగుతుంటే.. ఆన్‌డ్యూటీ సదుపాయం లేని వారు కూడా మేము సైతం అంటూ డెరైక్టరేట్ బాట పట్టారు. ఎలాగూ పర్యవేక్షణ అధికారులు లేరు. సంఘాలకు పట్టదు. దీంతో ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకునే వారు లేకుండాపోయారు. జిల్లాలు, మండల కేంద్రాల్లో మరీ దారుణం. స్కూళ్లలో తమ పూర్తి సమయాన్ని వెచ్చిస్తున్న సంఘాల నేతలు తక్కువేనన్న అపవాదును ఉపాధ్యాయులు మూటగట్టుకోవాల్సి వస్తోంది. సంఘాల నేతల పేరుతో దాదాపు వందల మంది టీచర్లు బడిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్ని ఉపాధ్యాయ సంఘాలు అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వమూ దీనిపై దృష్టి సారించింది. సంఘాలను కట్టడి చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే దృష్టిసారించిన సర్కారు... ఉపాధ్యాయ సంఘాలపై ఇదివరకే ప్రభుత్వం దృష్టి పెట్టింది. సంఘాల లెక్క తేల్చే కసరత్తు చేస్తోంది. 42 ఉపాధ్యాయ సంఘాలు అవసరమా? ఆర్టీసీ తరహాలో ఒక గుర్తింపు సంఘం ఉంటే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల వరంగల్‌లో మరోసారి స్పష్టం చేశారు. ఇది కుదరకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోని మూడు నాలుగు సంఘాలు మాత్రమే ఉపాధ్యాయ సమస్యలపై ప్రాతినిధ్యం చేసేలా కట్టడి చేసేందుకు ఏమైనా మార్గాలు ఉన్నాయా? అన్న అంశాలపై లోతైన పరిశీలన చేస్తోంది. ఏయే సంఘాల్లో ఎందరు? ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారు? ఏయే సంఘంలో ఎంత మంది సభ్యత్వం తీసుకున్నారన్న లెక్కలను తేల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయుడు ఐదారు సంఘాల్లో ఉండటంతో తాము ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటే తామే ఎక్కువ సభ్యత్వం కలిగి ఉన్నామంటూ చెబుతుండటం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అంటూ పాఠశాలలను వదిలి విద్యా డెరైక్టరేట్, డీఈఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పైగా విద్యా హ క్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయుడు బడి బయట ఉండటానికి వీల్లేదు. ఎలాంటి డిప్యుటేషన్లలో కొనసాగడానికి వీల్లేదు. అయినా అలా జరుగుతూనే ఉంది. అందుకే సంఘాల పేరుతో తిరుగుతున్న ఉపాధ్యాయుల విషయంలో ఓ స్పష్టమైన విధానాన్ని తేవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉపాధ్యాయ సంఘాల బైలాస్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒక సంఘంలోని సభ్యుడు మరో సంఘంలో ఉండకుండా కట్టడి చేసేందుకు సభ్యత్వ నమోదుకు ఆధార్ కార్డు లింకు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 42 ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇన్ని అవసరమా? ఇన్ని ఉండటం వల్లే సంఘాల గౌరవం ప్రశ్నార్థకం అవుతోంది.. అందుకే గుర్తింపు సంఘం ఒకటే ఉండే అంశంపై ఆలోచిస్తాం. - ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి -
ఏపీ ఉద్యోగుల తరలింపు ఈ ఏడాదే
* దశలవారీ తరలింపు యోచనే లేదు * అన్ని కార్యాలయాలూ ఒకేసారి... * 3-4 నెలల్లో రోడ్‌మ్యాప్ సిద్ధం * ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం * సంఘాల నేతలతో సీఎస్, ఉన్నతాధికారుల భేటీ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపును ఈ ఏడాదే పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం అనే మాటే అనవద్దని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ‘కొన్ని శాఖల తరలింపు-దశలవారీ తరలింపు’ ప్రతిపాదననూ ప్రభుత్వం తోసిపుచ్చింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భాగస్వామ్య సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, సీఎం వో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, రాజధాని తరలింపు కమిటీకి నేతృత్వం వహిస్తున్న జవహర్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఉద్యోగసంఘాల నేతలు అశోక్‌బాబు, మురళీకృష్ణ, ఐ.వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, యోగేశ్వరరెడ్డి, ఫణిపేర్రాజు తదితరులు హాజరయ్యారు. కార్యాలయాల తరలింపునకు అవసరమయ్యే వసతి, అందుబాటులో ఉన్న భవనాలు.. తదితర అంశాలను అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. విద్యాసంవత్సరం మధ్యలో తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదు. తరలింపు ప్రక్రియను ప్రారంభించడం, ముగించడం ఒకేసారి జరగాలన్నారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన సమస్యలివీ.. 1. కనీసం 25వేల మంది ఉద్యోగులు తరలివెళ్లాల్సి ఉంటుందని, వారి పిల్లల ‘స్థానికత’ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 371-డిని సవరించి ‘స్థానికత’ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి. 2. వేల సంఖ్యలో తరలివెళ్లడం వల్ల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లు దొరకవు. దొరికినా అద్దెలు అందుబాటులో ఉండవు. వసతి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాలను వెంటనే తరలించడం సాధ్యం కాదు. రెండుచోట్ల నివాసం ఉండాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించాలి. 3. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దెభత్యం(హెచ్ఆర్ఏ) ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్ఆర్ఏ వస్తుంది. తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్ఆర్ఏలో కోతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అన్ని విషయాలూ సీఎం దృష్టికి.. ఉద్యోగుల వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అధికారులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. కేవలం ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’లోని ఉద్యోగ సంఘాలనే పిలిచామని, వచ్చే సమావేశానికి శాఖాధికార్యాలయాల్లోని అన్ని సంఘాలను పిలుస్తామని తెలిపారు. పది రోజుల్లోనే తదుపరి సమావేశం, దాని తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. 3-4 నెలల్లోనే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. మనోభిప్రాయాలను గౌరవిస్తేనే.. తమ మనోభిప్రాయాలను గౌరవిస్తేనే ఉద్యోగుల తరలింపునకు సహకరిస్తామని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు తెగేసి చెప్పారు. భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తరలివెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు పిల్లలకు లోకల్ స్టేటస్(స్థానికత) కల్పించేందుకు 371డీ అధికరణను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటూ హైదరాబాద్‌లో తమకు ఇచ్చిన ఇళ్లస్థలాలు ఇప్పటిదాకా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ కాలేదని.. ఈ నేపథ్యంలో ఆ స్థలాల్లో గృహాలు నిర్మించుకోవడానికి సర్కారే పూచీకత్తు ఇచ్చి రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.