ఏపీ ఉద్యోగుల తరలింపు ఈ ఏడాదే
* దశలవారీ తరలింపు యోచనే లేదు
* అన్ని కార్యాలయాలూ ఒకేసారి...
* 3-4 నెలల్లో రోడ్‌మ్యాప్ సిద్ధం
* ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేసిన ఏపీ ప్రభుత్వం
* సంఘాల నేతలతో సీఎస్, ఉన్నతాధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపును ఈ ఏడాదే పూర్తి చేయాలని, వచ్చే సంవత్సరం అనే మాటే అనవద్దని ఉద్యోగ సంఘాలకు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘కొన్ని శాఖల తరలింపు-దశలవారీ తరలింపు’ ప్రతిపాదననూ ప్రభుత్వం తోసిపుచ్చింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భాగస్వామ్య సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, సీఎం వో ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, రాజధాని తరలింపు కమిటీకి నేతృత్వం వహిస్తున్న జవహర్‌రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఉద్యోగసంఘాల నేతలు అశోక్‌బాబు, మురళీకృష్ణ, ఐ.వెంకటేశ్వరరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, యోగేశ్వరరెడ్డి, ఫణిపేర్రాజు తదితరులు హాజరయ్యారు.
కార్యాలయాల తరలింపునకు అవసరమయ్యే వసతి, అందుబాటులో ఉన్న భవనాలు.. తదితర అంశాలను అధికారులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. విద్యాసంవత్సరం మధ్యలో తరలించడం వల్ల ఇబ్బందులు వస్తాయని ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అధికారులు పట్టించుకోలేదు. తరలింపు ప్రక్రియను ప్రారంభించడం, ముగించడం ఒకేసారి జరగాలన్నారు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రధాన సమస్యలివీ..
1. కనీసం 25వేల మంది ఉద్యోగులు తరలివెళ్లాల్సి ఉంటుందని, వారి పిల్లల ‘స్థానికత’ ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 371-డిని సవరించి ‘స్థానికత’ సమస్యను అధిగమించడానికి చర్యలు తీసుకోవాలి.
2. వేల సంఖ్యలో తరలివెళ్లడం వల్ల విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో అద్దె ఇళ్లు దొరకవు. దొరికినా అద్దెలు అందుబాటులో ఉండవు. వసతి కల్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి. పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాలను వెంటనే తరలించడం సాధ్యం కాదు. రెండుచోట్ల నివాసం ఉండాలంటే ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించాలి.
3. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దెభత్యం(హెచ్‌ఆర్‌ఏ) ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏలో కోతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అన్ని విషయాలూ సీఎం దృష్టికి..
ఉద్యోగుల వ్యక్తంచేసిన అభిప్రాయాలు, సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని అధికారులు ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. కేవలం ‘జాయింట్ స్టాఫ్ కౌన్సిల్’లోని ఉద్యోగ సంఘాలనే పిలిచామని, వచ్చే సమావేశానికి శాఖాధికార్యాలయాల్లోని అన్ని సంఘాలను పిలుస్తామని తెలిపారు. పది రోజుల్లోనే తదుపరి సమావేశం, దాని తర్వాత మరో సమావేశం ఏర్పాటు చేసి తుది నిర్ణయం తీసుకుందామని చెప్పారు. 3-4 నెలల్లోనే రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు.
మనోభిప్రాయాలను గౌరవిస్తేనే..
తమ మనోభిప్రాయాలను గౌరవిస్తేనే ఉద్యోగుల తరలింపునకు సహకరిస్తామని ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు తెగేసి చెప్పారు. భేటీ అనంతరం సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ మీడియాతో మాట్లాడారు. తరలివెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు పిల్లలకు లోకల్ స్టేటస్(స్థానికత) కల్పించేందుకు 371డీ అధికరణను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించడంతోపాటూ హైదరాబాద్‌లో తమకు ఇచ్చిన ఇళ్లస్థలాలు ఇప్పటిదాకా తమ పేర్లపై రిజిస్ట్రేషన్ కాలేదని.. ఈ నేపథ్యంలో ఆ స్థలాల్లో గృహాలు నిర్మించుకోవడానికి సర్కారే పూచీకత్తు ఇచ్చి రుణాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.