
సాక్షి, అమరాతి: ప్రభుత్వ ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌ఎస్ రావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పీఆర్‌సీ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో వారు చర్చించారు.
ఈ సందర్భంగా ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లతో ఉద్యోగ సంఘాలు చర్చించిచాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. మెడికల్ రియంబర్స్‌మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పీఆర్సీ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామని మీడియాతో ఆయన చెప్పారు.
ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు త్వరలో పూర్తిగా చెల్లిస్తామని అధికారులు చెప్పారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. వచ్చే సమావేశానికి పీఆర్సీ నివేదికతో రావాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. కాగా, గతనెల 29న చీఫ్‌సెక్రటరీ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు మరోసారి భేటీ అయ్యారు.