సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక, వివిధ శాఖలకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ల దాఖలు, కోర్టు తీర్పుల సత్వర అమలు, వివిధ పథకాలకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టడం, నూతన ప్రతిపాదనలు సమర్పించడం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు.
ప్రతి నెలా మొదటి బుధవారం సమావేశం
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెలా మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు.
► రాష్ట్ర సచివాలయం మొదలు.. గ్రామస్థాయి వరకూ ఈ–ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
► ఒక అంశానికి సంబంధించిన ఫైలును.. క్షేత్రస్థాయి కార్యాలయం మొదలు, రాష్ట్ర సచివాలయం వరకూ ఒకే నంబర్‌తో నిర్వహించేలా చూడాలని, దీనికి సంబంధించి కొన్ని యునిక్ నంబర్లను రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్ ఆదేశించారు.
► వివిధ శాఖల్లో డీపీసీ క్యాలెండర్ల ప్రకారం సకాలంలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, పూనం మాలకొండయ్య, ప్రవీణ్‌కుమార్, అజయ్ జైన్, కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment