గీత స్మరణం
పల్లవి :
ఆమె: సరిగమపదనిని నీ దానినీ (2)
సరిగా సాగనీ నీ దారినీ
సరిగమపదనిని నీ దానినీ
అతడు: దాగని నిగనిగ ధగధగమని
దా మరి మానిని సరిదారిని
(2)
చరణం :
ఆ: సామసాగరిని సాగనీ నీ దరినీ (2)
పదమని మరి నీ సగమని
అ: నీదాపామని పాదని సాదని (2)
గరిమగ మగనిగ మరి మరి సాగనీ
ఆ: సరిగమపదనిని నీ దానినీ
అ: దా మరి మానిని సరి దారిని
చరణం : 2
అ: నిగమాగమాపగా నీ సరిగ గాగా (2)
సరిగమపదనీ గనిగా దా (2)
ఆ: నీ గరిమని గని నీదరిని మని (2)
సాగనీ సమపద సమాగమమని
అ: దాగని నిగనిగ ధగధగమనీ
దా మరి మానిని సరి దారినీ (2)
ఆ: సరిగమపదనిని నీ దానిని (2)
సరిగా సాగనీ నీ దారినీ
సరిగమపదనిని నీ దానినీ
చిత్రం : స్వరకల్పన (1989)
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
సంగీతం : అమర్, గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
జననం : 7-7-1959, జన్మస్థలం : విజయవాడ
తల్లిదండ్రులు : లక్ష్మీనరసమ్మ, సుబ్బారావు
చదువు : భాషాప్రవీణ, ఎం.ఏ. (తెలుగు)
భార్య : శేషుకుమారి
సంతానం : కవలలు (లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ), కుమారుడు (మాణిక్య తేజ)
తొలిచిత్రం-పాట : రౌడీపోలీసు (1987) -
ఇది వరమా శాపమా... ఇది నీకు న్యాయమా
ప్రస్తుత సినిమా-పాట : నిర్భయ భారతం (2013) - శుభము సుఖము సృష్టికి మూలము... శృంగారమే మోక్షము ధర్మశృంగారమే మోక్షము.
సినిమా పాటల్లో అనేక ప్రయోగాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకస్థానాన్ని ఏర్పరచుకున్నారు జొన్నవిత్తుల. ఇప్పటివరకు సుమారు 600 పాటలు రచించారు.
ఇతరవిషయాలు : 10 శతకాలు రచించారు. అవి శ్రీరామ లింగేశ్వర, బతుకమ్మ, తెలుగమ్మ, సింగరేణి, తెలుగుభాష, నైమిశ వెంకటేశ, రామబాణం, కూచిపూడి, రామప్ప, శ్రీరామలింగేశ్వర (ఆంగ్లం) శతకాలు. తెలుగుభాష గొప్పదనాన్ని చాటి చె పుతూ ‘తెలుగు శంఖారావం’ పేరుతో 56 తెలుగు గీతాలు రాశారు. సప్తస్వరాలను తీసుకొని దానితో పాటను రాసిన తొలి తెలుగుకవి. సప్తస్వరాలకు అర్థాలు ఉండవని చాలామంది అనుకుంటారు. కాని అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదని స్వరాలకు కూడా అర్థాలు ఉంటాయని నిరూపించారు జొన్నవిత్తుల. స్వరాలను అర్థవంతంగా కూర్చి ఈ పాటను రూపొందించారు.
సరిగమపదని... ఈ ఏడు అక్షరాలను రాగం తప్పకుండా పదాలు తయారుచేయడం ఆషామాషీ విషయం కాదు. స్వరాలను పదాలుగా మార్చి భాషతో చెడుగుడు ఆడుకున్నారు ఈ పాటలో. ఉదాహరణకు... సాగనీ, పదమనీ, దాగనీ, నీ దానినీ, నిగనిగ, మానిని, దా మరి, సరిదానిని... వీటిని చూస్తే, పైకి స్వరాల కూర్పులాగే అనిపిస్తుంది. సరిగా అర్థం చేసుకుంటే అందులో దాగి ఉన్న పదం స్పష్టంగా అర్థం అవుతుంది. ఇది సినీ సంగీత సాహిత్యంలో సరికొత్త ప్రయోగం.