రోడ్డు నిర్మాణంతో తగ్గిన దూరం
వాగు అవతలి గ్రామాలకు సౌకర్యం
నంగునూరు: ఒకప్పుడు రెండు జిల్లాల సరిహద్దుగా ఉన్న ఆ గ్రామాలు నేడు ఒకే జిల్లా పరిధిలోకి రానున్నాయి. ప్రజల కోరిక మేరకు రెండు జిల్లాల మధ్య దూర భారం తగ్గించేందుకు మంత్రి హరీశ్‌రావు దూరదృష్టితో చేసిన కృషి ఫిలించింది. నాడు రాకపోకలను అనుకూలంగా లేని రోడ్డు నేడు తారు రోడ్డుగా మారడంతో రెండు మండలాల ప్రజలతో పాటు వాగు అవతలి గ్రామాలకు కూడా ఎంతో ప్రయోజనం చేకూరింది.
నంగునూరు మండల పరిధిలోని కొండంరాజ్పల్లి, గట్లమల్యాల, ఘణపూర్, ఖాత, అక్కేనపల్లి గ్రామాలు మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దులో ఉన్నాయి. కొండంరాజుపల్లి గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ధర్మారం గ్రామానికి నిత్యం రాకపోకలు సాగిస్తారు. అలాగే మెదక్ జిల్లా సరిహద్దులో ఉన్న వాగు అవతలి ఐదు గ్రామాలకు సిద్దిపేట 40 కిలో మీటర్ల దూరం ఉండగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ కేవలం 18 కిలో మీటర్ల దూరం ఉంటుంది.
దీంతో వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం రైతుల తోపాటు ప్రజలు ధర్మారం మీదుగా హుస్నాబాద్‌కు వెళ్లేవారు. వీరే కాకుండా కరీంనగర్ జిల్లా సరిహద్దులో ఉన్న గ్రామాల ప్రజలకు వరంగల్ జిల్లాలోని పలు మండలాలకు వెళ్లాలన్నా ఈ మార్గం గుండా రాకపోకలు సాగించాలి.
రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదల
కొండంరాజ్పల్లి నుంచి కరీంనగర్ జిల్లాలోని ధర్మారం గ్రామం కేవలం రెండు కిలో మీటర్లు మాత్రమే ఉంటుంది. ఈ గ్రామం మీదుగా లంబాడి తండా, పందిళ్ల మీదుగా రేగొండ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ రెండు గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటూ ఎన్నో సార్లు ప్రతిపాదనలు పంపారు.
ఈ తరుణంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో రాష్ట్ర ప్రభుత్వం కొండంరాజ్పల్లి నుంచి ధర్మారం మీదుగా రేగొండ వరకు 8.8 కిలోమీటర్లు దూరానికి గాను పీఎంజీఎస్‌వై పథకం కింద రూ. 6.22 లక్షలు మంజూరు చేసింది. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో కొండంరాజ్పల్లితో పాటు ఖాత, ఘనపూర్ గ్రామాల ప్రజలకు హుస్నాబాద్ వెళ్లేందుకు సౌకర్యంగా మారింది. కొత్త జిల్లా ఏర్పాటులో భాగంగా హుస్నాబాద్ నియోజక వర్గాన్ని సిద్దిపేటలో కలుపనున్న నేపథ్యలో నంగునూరు, మద్దూర్, హుస్నాబాద్ మండల ప్రజలకు ఈరోడ్డు ద్వారా దూరం తగ్గనుంది.