జిల్లా ఎస్పీ బదిలీ
కొత్త ఎస్పీగా విజయ్‌కుమార్
కాకినాడ ఏపీఎస్పీకి ప్రభాకరరావు బదిలీ
విజయవాడలో ఇద్దరు డీసీపీలకు స్థాన చలనం
సాక్షి, విజయవాడ/మచిలీపట్నం : జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు బదిలీ అయ్యారు. ఆయనతోపాటు విజయవాడ కమిషనరేట్‌లో ఇద్దరు డీసీపీలనూ బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీగా తూర్పుగోదావరి ఎస్పీగా పనిచేస్తున్న జి.విజయ్‌కుమార్ రానున్నారు.
ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న జె.ప్రభాకరరావును కాకినాడలోని ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీచేశారు. విజయవాడ కమిషనరేట్‌లో లా అండ్ అర్డర్ డీసీపీగా పనిచేస్తున్న ఎం.రవిప్రకాష్‌ను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా నియమించారు. అయన స్థానంలో విజయనగరం ఎస్పీగా పనిచేస్తున్న తప్సీర్ ఇక్బాల్ విజయవాడ రానున్నారు.
రవిప్రకాష్ 2012, డిసెంబర్ ఒకటో తేదీన కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ కమిషనరేట్‌లో డీసీపీ(అడ్మిన్)గా పనిచేస్తున్న ఎ.సత్తార్‌ఖాన్ శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా బదిలీఅయ్యారు. అయన స్థానంలో వైఎస్సార్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న జీవీజీ అశోక్‌కుమార్ విజయవాడ రానున్నారు. సత్తార్‌ఖాన్ 2012, నవంబర్ 26న బాధ్యతలు స్వీకరించారు.
ఎస్పీ విజయ్‌కుమార్ ప్రొఫైల్
వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన విజయ్‌కుమార్ 1998లో గ్రూప్-1 ఉత్తీర్ణుడై డీఎస్పీగా ఎంపికయ్యారు. వరంగల్, అనంతపురంలో డీఎస్పీగా పనిచేశారు. అనంతపురం ఓఎస్ డీగా, విజయవాడ డీసీపీగా, సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. పదోన్నతిపై మెదక్ ఎస్పీగా వెళ్లారు. అక్కడి నుంచి తూర్పు గోదావరి జిల్లాకు బదిలీ అయ్యారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. వివాదరహితుడిగా పేరుంది. సిబ్బంది, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై తక్షణమే స్పందించేవారు. గత ఫిబ్రవరి 17న తూర్పుగోదావరి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బదిలీపై కృష్ణా జిల్లా ఎస్పీగా వస్తున్నారు.
సిబ్బంది పనితీరు మెరుగుపరిచిన ప్రభాకరరావు
జిల్లా ఎస్పీగా జె.ప్రభాకరరావు 2012, డిసెంబర్ ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించారు. దాదాపు 19 నెలలపాటు ఇక్కడ బాధ్యతలు నిర్వహించిన ఆయన సార్వత్రిక ఎన్నికల అనంతరం బదిలీ అవుతారని ప్రచారం జరిగింది. జె.ప్రభాకరరావు ఇక్కడ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నప్పటికీ జిల్లాలో ఎక్కువగా హత్యలు, దొంగతనాలు జరిగాయి.
మచిలీపట్నం మండలం పెదపట్నం వద్ద ఐదు రాష్ట్రాల పరిధిలో మెరైన్ అకాడమీ ఏర్పాటుకు కృషి చేశారు. ఈ అకాడమీ ప్రతిపాదనల దశలోనే ఉంది. పోలీస్ సిబ్బంది కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించేలా చూశారు. మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కృషిచేశారు. ఎన్నికల అనంతరం అధికార పార్టీ నాయకుల ఆడగాలను అరికట్టలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.
పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. హైవే పెట్రోలింగ్ వాహనాలు, పోలీస్ అధికారుల సెల్ఫోన్లకు జీఎస్ఎం పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చి పనితీరు మెరుగుపడేలా చొరవచూపారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే బెనిఫిట్లు అందేలా చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
సోమవారం మాత్రమే ఎస్పీ కార్యాలయానికి వస్తారని, ఎక్కువ రోజులు క్యాంపు కార్యాలయాలకు పరిమితమవుతారనే అపవాదు ప్రభాకరరావుపై ఉంది. సిబ్బంది, అధికారుల బదిలీల విషయంలో రాజకీయ నాయకుల సిఫార్సులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని విమర్శలు ఎదుర్కొన్నారు. మైలవరంలో 2013, జూలైలో అప్పటి సీఐ బంగార్రాజు ప్రజలపై కాల్పులు జరిపిన అనంతరం విచారణ సక్రమంగా సాగలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి.