జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ ట్రయల్ రన్.. అయోమయంలో వాహనదారులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసుల ప్రయోగాత్మక ఆంక్షల నడుమ వాహనాలు ఆగుతూ... సా..గుతూ కనిపించాయి. సీవీఆర్ జంక్షన్, రోడ్ నెం. 45 జంక్షన్లో రైట్ టర్న్‌ను తొలగించడంతో తొలి రోజు ఎక్కువ మందికి అవగాహన లేకపోవడంతో చుట్టూ తిరుగుతూ ప్రయాణించాల్సి వచ్చింది.
► జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45 బాలకృష్ణ నివాసం చౌరస్తాతో పాటు జర్నలిస్టు కాలనీ, సీవీఆర్, బీవీబీపీ చౌరస్తా, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులు కొన్ని మార్గాల్లో ట్రయల్ రన్ కింద మళ్లింపులు చేపట్టి శుక్రవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఇద్దరు ట్రాఫిక్ ఏసీపీలు, ఇద్దరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది ఎస్ఐలు కలిసి మొత్తం 32 మంది ట్రాఫిక్ పోలీసులు ఈ ట్రాఫిక్ మళ్లింపును పర్యవేక్షించారు.
► మధ్యాహ్నం 12 గంటల నుంచి ట్రాఫిక్ మళ్లింపులు ప్రారంభించారు. చాలా మందికి అవగాహన లేకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక గజిబజిగా ముందుకు సాగుతుండగా ట్రాఫిక్ పోలీసులు వారికి దారి చూపారు.
► అయితే పలుచోట్ల ట్రాఫిక్ చాంతాండాంత దూరానికి నిలిచిపోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు. మొదటి రోజు వాహనాలు వివిధ మార్గాల నుంచి మళ్లించడంతో చుట్టూ తిరుగుతూ వాహనదారులు గమ్యస్థానాలకు వెళ్లారు.
► నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ రంగనాథ్, ఏసీపీ జ్ఞానేందర్‌రెడ్డి పలుచోట్ల యూటర్న్లు, రైట్ టర్న్‌లను పరిశీలించారు.
రాంగ్ రూట్లో ఆర్టీసీ బస్సు
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 ప్రధాన రోడ్డులో పెద్దమ్మ గుడి కమాన్ నుంచి మాదాపూర్ వెళ్లే టర్నింగ్ వద్ద పిల్లర్ నెంబర్ సి–1659 నుంచి హెచ్‌సీయూ డిపోకు చెందిన సిటీ బస్సు శుక్రవారం ఉదయం రాంగ్రూట్లో వస్తూ కనిపించింది. సాధారణంగా ఆటో వాలాలు, ద్విచక్ర వాహనదారులు రాంగ్రూట్లో వెళ్లడం కనిపిస్తుంది. ఏకంగా సిటీ బస్సు రాంగ్రూట్లో వస్తుండటంతో స్థానికులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని ఓ స్కూటరిస్ట్ ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
సర్వీసు రోడ్డులో నిండుగా...
జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45ల కేబుల్ బ్రిడ్జి నిర్మించి దానికి అనుసంధానంగా ఫ్లై ఓవర్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు సర్వీసు రోడ్డులో వాహనాలు ఏ రోజు కూడా నిండుగా కనిపించలేదు. కానీ తొలిసారి శుక్రవారం నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయా జంక్షన్ల వద్ద పోలీసులు ఆంక్షలు విధించి మళ్లింపులు చేపట్టడంతో సర్వీసు రోడ్లు సైతం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. మరో వైపు రోడ్ నెం.45లోని ఫ్లై ఓవర్ మీదుగా కేబుల్ బ్రిడ్జి వైపు వాహనాలు తక్కువగా వెళ్లడం గమనార్హం. (క్లిక్ చేయండి: 20 నిమిషాల్లో పంజాగుట్ట నుంచి ఓఆర్ఆర్కు)
జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుంచి బాలయ్య ఇంటి దగ్గర రైట్ టర్న్ తీసేసిన ట్రాఫిక్ పోలీసులు. ఫిల్మ్ నగర్ జంక్షన్ వద్ద కూడా యూ టర్న్ లేదు. సిగ్నల్ ఫ్రీ అంటే మమ్మల్ని సిటీ అంతా తిప్పడం కాదు సర్
అట్టర్ ఫ్లాప్ ప్రయోగం. Please Look into this. @HYDTP. @HiHyderabad #Hyderabad @KTRTRS
— Vidya Sagar Gunti (@GVidya_Sagar) November 25, 2022
నగర వాసులు ఏమంటున్నారు..
మరోవైపు ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ట్రయన్ రన్‌పై నగర వాసులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించమంటే తమను ఊరంతా తిప్పుతున్నారని అంటున్నారు.
So! The city traffic police woke up one day and said - everything is fine, let’s mess up? Was that the thought behind all these diversions/ no U-turns in Jubilee Hills? Such chaos! #Hyderabad #HyderabadTraffic #WhatOnly🤯 pic.twitter.com/WpDIaB0u7Y
— Revathi (@revathitweets) November 26, 2022