సందిగ్ధంలో ఆ ఇద్దరు
సాక్షి, సంగారెడ్డి: ‘మిస్టర్ కూల్’గా పేరున్న నందీశ్వర్‌గౌడ్, ఫైర్‌బ్రాండ్ ఇమేజ్ ఉన్న తూర్పు జయప్రకాశ్‌రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వీరిద్దరూ పార్టీ మారుతున్నారన్న అంశం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీరిద్దరూ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లా రాజకీయాల్లో పేరున్న నందీశ్వర్‌గౌడ్, జగ్గారెడ్డిలు ప్రస్తుతమున్న పార్టీలను వీడి కొత్త కండువాలు కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు కూడాఎటుపోదామంటూ అనుచరుల అభిప్రాయాలను సేకరిస్తుండగా, వీరి అడుగులు ఎటు పడతాయోనని కేడర్ ఆసక్తిగా గమనిస్తోంది.
సొంత పార్టీలో ఇమడలేకే..
జిల్లాలో ఏకైక బీసీ నాయకునిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌కు సొంత పార్టీ నుంచి ఎప్పుడూ చేదు అనుభవమే ఎదురవుతూ వచ్చింది. సొంత పార్టీ నాయకులే ఆయన్ను ఎప్పటికప్పుడు తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సాధారణ ఎన్నికల సమయంలో సొంత పార్టీ నాయకులే తనకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారనే ఆవేదనతో నందీశ్వర్‌గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో గులాబి దళపతి కేసీఆర్‌తో భేటీ కూడా అయ్యారు.
ఆయన గులాబీ గూటికి దాదాపుగా చేరినట్టే అనుకున్న సమయంలో ఢిల్లీ పెద్దలు రంగ ప్రవేశం చేసి బుజ్జగించడంతో నందీశ్వర్ మనుసు మార్చుకుని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి భూపాల్‌రెడ్డి, చంద్రారెడ్డి లాంటి కీలక నేతలు వెళ్లిపోయినప్పటికీ నందీశ్వర్ పార్టీ కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అయినప్పటికీమెదక్ ఉప ఎన్నికలో తన గెలుపు కోసం నందీశ్వర్‌గౌడ్ పనిచేయలేదని సునీతాలక్ష్మారెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీనికితోడు ఇటీవల సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ఆయనను ఆహ్వానించలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన నందీశ్వర్‌గౌడ్ సొంత పార్టీలో అవమానాలు ఎదుర్కొంటు ఉండటం కంటే పార్టీ మారి కేడర్‌ను కాపాడుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. నందీశ్వర్‌గౌడ్ పార్టీ మారే యోచనను పసిగట్టిన గులాబీ పార్టీ, టీడీపీలు ఆయనకు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. నందీశ్వర్‌గౌడ్ పార్టీ మారిన పక్షంలో పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్ద దెబ్బ తగలనుంది.
కాంగ్రెస్‌వైపే జగ్గారెడ్డి అడుగులు
ఫైర్‌బ్రాండ్‌గా పేరొందిన సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మెదక్ ఉప ఎన్నికల సందర్భంగా బీజేపీ తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ నుంచే పోటీ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన బీజేపీకిదూరంగానే ఉంటూ వస్తున్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో బీజేపీ చేపట్టే ఏ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొనటం లేదు. దీనికితోడు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరితేనే బాగుంటుందని అనుచరులంతా ఆయనపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాజకీయ అవసరాల దృష్ట్యా తన ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీలో చేరటమే బాగుంటుందని జగ్గారెడ్డి సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ లేదా జనవరిలో కాంగ్రెస్‌లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.