ఆకు పచ్చినిజాలు
ఆవిష్కరణ
ఒక ఆకు పూసింది... కొమ్మ లేకుండా! జూలియన్ మెల్కొరి అనే డిజైన్ ఇంజనీరింగ్ విద్యార్థి రూపొందించిన ‘కృత్రిమ-ఆకు’ మొక్క అవసరం లేకుండానే ప్రాణవాయువును వెలువరించడమే కాక స్పేస్ సైన్స్ రూపురేఖల్ని కూడా మార్చబోతోంది.
ఒక ఆకు కార్బన్ డై ఆక్సైడ్‌ని పీల్చుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అనేది మనందరికి తెలిసిన విషయమే! ఈ చర్యకు ముఖ్య కారణం ఆకులోని క్లోరోఫ్లాస్ట్ అనే పదార్థం. అది సూర్యరశ్మిని వాడుకుని కార్బన్ డయాక్సైడ్ని ఆక్సిజన్‌గా మారుస్తుంది. కానీ ఒక చెట్టు ఎదగాలన్నా, మనుగడలో ఉండాలన్నా కావాల్సింది గురుత్వాకర్షణ శక్తి. అది ఔటర్ స్పేస్‌లో ఉండదు కాబట్టి, వ్యోమగాములు, రాకెట్లలో చెట్లని పట్టుకెళ్లలేరు. కోట్ల రూపాయలు వెచ్చించి ఆక్సిజన్ సిలండర్స్ని తీసుకెళ్తారు. కానీ జూలియన్ మెల్కొరి కనిపెట్టిన ఈ సింథటిక్ ఆకుతో ఆ ఖర్చుని తగ్గించవచ్చు.
చూడటానికి మామూలు ఆకులానే ఉన్నా, దీన్ని సిల్క్ ఫైబర్స్ నుండి సేకరించబడిన ఒక జిగురులాంటి పదార్థంలో, ఆకుల నుండి తీయబడిన క్లోరోప్ల్లాస్ట్ని కలుపుతారు. ఆ జిగురు పదార్థంలో ఉండే కణజాలం, ఒక మేట్రిక్స్లా మారి అందులో క్లోరోఫ్లాస్ట్ని ఇముడ్చుకుని స్థిరంగా ఉంచుతుంది. జీరో గ్రావిటీలో కూడా క్లోరోప్లాస్ట్ని పనిచేసేలా చేస్తుంది. దీనికి సూర్యకాంతి కూడా అవసరం లేదు. ఇంట్లో వాడే బల్బు నుండి వెలువడే కాంతి సరిపోతుంది. అందుకే ఈ సింథటిక్ ఆకు మీద మరికొన్ని పరిశోధనలు చేసి, వ్యోమగాములకు ఆక్సిజన్ కొరత రాకుండా చూసే ప్రయత్నంలో ఉన్నారు.
అంతేకాక, ఈ ఆకులని, ఆకాశహర్మ్యాల్లో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండే ఫ్లోర్లలో వాడుతున్నారు. ఒక బల్బ్ చుట్టూ డెకరేటివ్ కవర్లా పెట్టుకుంటే, ఆక్సిజన్ని అందించడమే కాక అందాన్ని కూడా ఇస్తుంది ఈ సింథటిక్ ఆకు.