టాప్ 10లో ఏడు కార్లు మారుతివే!
జూలై నెలలో కార్ల అమ్మకాలు మంచి జోరుమీద సాగాయి. ప్రధానంగా వర్షాలు బాగా కురవడంతో ఈ అమ్మకాలు పెరిగాయని అంటున్నారు. మొత్తం అమ్మకాల్లో మారుతి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. బాగా అమ్ముడైన టాప్ 10 కార్ల బ్రాండ్లలో ఏడు మారుతివే కావడం గమనార్హం. దాని ప్రధాన పోటీదారు హ్యుందయ్ కార్స్ కూడా గత నెల అమ్మకాల్లో 12.9 శాతం వృద్ధి సాధించింది. మారుతి, హ్యుందయ్లతో పాటు క్విడ్ అమ్మకాల పుణ్యమాని ఫ్రెంచి కార్ల కంపెనీ రెనో కూడా టాప్ 10 జాబితాలో చోటు సంపాదించింది.
మారుతి ఆల్టో, డిజైర్, వ్యాగన్ ఆర్, స్విఫ్ట్ బ్రాండ్లు మొదటి నాలుగు స్థానాల్లో నిలిచాయి. మారుతి కార్లలో మంచి ఆదరణ పొందిన ఆల్టో బ్రాండ్ ఈసారి కూడా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఐదో స్థానంలో హ్యుందయ్ గ్రాండ్ ఐ10 ఉండగా, ఆరో స్థానంలో రెనో క్విండ్ నిలిచింది. మారుతి బాలెనో, హ్యుందయ్ ఇలైట్ ఐ20 బ్రాండ్లు మాత్రం ఏడు, ఎనిమిది స్థానాలకు పరిమితం అయ్యాయి. మారుతి సెలెరియో, సియాజ్ బ్రాండ్లు 9, 10 స్థానాల్లో ఉన్నాయి. టాటా టియాగో అమ్మకాలు కూడా బాగానే ఉన్నా.. అది 11వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జూలైలో వివిధ బ్రాండ్ల అమ్మకాలు ఇలా ఉన్నాయి..
ఆల్టో - 19,844
డిజైర్ - 19,229
వ్యాగన్ ఆర్- 15,207
స్విఫ్ట్ - 13,934
గ్రాండ్ ఐ10- 11,961
క్విడ్ - 9,897
బాలెనో- 9,120
ఇలైట్ ఐ20 - 8,205
సెలెరియో- 7,792
సియాజ్ - 5,162