రిటైల్ ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం రేటు జూలైలో స్వల్పంగా తగ్గింది. 9.64%గా ఈ రేటు నమోదయ్యింది. జూన్లో ఈ రేటు 9.87%. మొత్తంగా చూస్తే ద్రవ్యోల్బణం తగ్గినా... కూరగాయలుసహా పలు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల రేటు వార్షిక ప్రాతిపదికన తీవ్రంగానే ఉంది.
నిత్యావసరాల పెరుగుదల రేట్లు ఇలా...
2012 జూలైతో పోల్చితే 2013 జూలైలో మొత్తంగా ఈ విభాగం (ఆహారం, పానీయాలు) ద్రవ్యోల్బణం రేటు 11.24 శాతంగా (జూన్లో 11.84 శాతం) ఉంది. కూరగాయల ధరలు 16.4 శాతం ఎగశాయి. తృణధాన్యాలు సంబంధిత ఉత్పత్తుల రేటు 16.03 శాతంగా ఉంది. ప్రొటీన్ ఆధారిత గుడ్లు, చేపలు, మాంసం ధరలు 13.82 శాతం ఎగశాయి. పాలు-పాల ఉత్పత్తులు(8.14 శాతం), సుగంధ ద్రవ్యాలు (7.43శాతం), పండ్లు (6.81 శాతం), చక్కెర (5.30 శాతం) ధరలు కూడా పెరిగాయి.