బాలికల హాస్టళ్ల వద్ద పోకిరీలు
ఇబ్బందులు పడుతున్న విద్యార్థినులు
పట్టించుకోని అధికార యంత్రాంగం
కరువైన పోలీసుల పర్యవేక్షణ
వరంగల్ : వరంగల్ మహానగరంలో మహిళలకు ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. పోకిరీల బెడదతో మహిళలు, ప్రధానంగా విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. మహిళా హాస్టళ్లు ఏర్పాౖటెనా ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రభుత్వ వసతిగృహాల్లోని విద్యార్థినుల ఇబ్బందులైతే చెప్పుకునే స్థాయి దాటిపోయాయి. హన్మకొండలోని జులైవాడలో ఈ పోకరీల బెడద ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని హాస్టళ్ల సముదాయంలో ఓ పాఠశాల, మూడు హాస్టళ్లు ఉన్నాయి.
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక ఆశ్రమ పాఠశాల, పోస్టు మెట్రిక్ హాస్టళ్లు రెండు, డీఏహెచ్(డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్) హాస్టళ్లు కొనసాగుతున్నాయి. ఆయా వసతి గృహాల్లో ప్రాథమిక విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదివేబాలికలు, విద్యార్థినులు ఉంటున్నారు. ప్రాథమిక ఆశ్రమ పాఠశాలలో 600 మంది, వరంగల్, హన్మకొండ పరిధిలోని పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు 400 మంది, ఇంటర్మీడియట్, ఏఎన్ఎం, ఇతరత్రా కోర్సులు చేస్తున్న విద్యార్థినులు 200 మందికి డీఏహెచ్లో వసతి కల్పించారు.
అయితే, హాస్టళ్లలో బస చేసే వారి సంఖ్య ఎక్కువ కావడంతో పర్యవేక్షణ కొరవడిందని తెలుస్తోంది. పోలీసు శాఖ పరంగా కూడా పర్యవేక్షణ లేకపోవడంతో పలువురు పోకిరీలు అడ్డాగా మార్చుకున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు బయటి వ్యక్తులు సముదాయంలోకి వస్తుండడమే కాకుండా.. రాత్రివేళ ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఇబ్బంది పడుతున్నారని చెబుతున్నారు. ఇకనైనా శాఖ పరంగా పర్యవేక్షణకు రాత్రివేళ వాచ్మెన్ల సంఖ్య పెంచడంతో పాటు పోలీసులు కూడా పెట్రోలింగ్ నిర్వహిం చాలని పలువురు కోరుతున్నారు.