కోర్టుకు వెళ్లిన ఏనుగు తల్లి.. పిల్ల
అసోంలోని ఓ కోర్టుకు సరికొత్త అతిథులు వచ్చారు. ఎవరా అని అనుకుంటున్నారా? ఓ ఏనుగు, దాని పిల్ల. వాటి సంరక్షణ బాధ్యత గురించి జడ్జి తేల్చాల్సి రావడంతో వీటిని కోర్టుకు తీసుకురావాల్సి వచ్చింది. అయితే.. కోర్టు హాల్లోకి వాటిని తీసుకురావడం అసాధ్యం కాబట్టి, స్వయంగా జడ్జిగారే కోర్టు లాన్ వద్దకు వెళ్లి, అక్కడ ఆ తల్లీ పిల్లలను చూసి రావాల్సి వచ్చింది. ఈ ఘటన అసోంలోని మారుమూల ప్రాంతమైన హైలాకండి జిల్లాలో జరిగింది. ఇది బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉంటుంది.
ఈ రెండు ఏనుగులు సరిహద్దుల్లో భారతదేశం వైపు కనిపించాయి. అయితే, అవి తనవంటూ స్థానికుడు ఒకరు చెబుతున్నారు. అందులో ఆడ ఏనుగును తనవద్ద నుంచి ఎనిమిదేళ్ల క్రితం ఎవరో దొంగిలించారని ఆయన ఆరోపించారు. కానీ బంగ్లాదేశీ వ్యక్తి మాత్రం అది తప్పంటున్నాడు. అవి రెండూ తన ఏనుగులని, కొన్ని రోజుల క్రితం నుంచి తప్పిపోయాయని వాటి కోసం తాను అన్నిచోట్లా వెతికి, చివరకు బంగ్లాదేశ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశానని అన్నాడు. వాళ్లు సరిహద్దు దళం వారితో మాట్లాడి, తన ఏనుగులు రెండూ హైలాకండిలో ఉన్నట్లు చెప్పారని తెలిపాడు. అందుకే వాటిని ఎలాగోలా మళ్లీ తన ఊరికి తీసుకెళ్లడానికే వచ్చానన్నాడు.
ఆ ఏనుగులు ఎవరివన్న విషయం కాసేపు పక్కన పెట్టి, ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారి ఒకరికి వాటిని అప్పగించారు. వాటికి చక్కగా ఆహారం అందించాలని, జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. దాంతో ఏనుగులు అటు బంగ్లాదేశ్ వెళ్లాలో.. ఇటు భారత దేశంలో ఉండాలో తెలియక తికమక పడుతూ హాయిగా అటవీ శాఖ అధికారులు అందిస్తున్న చెరుకు గడలు, గడ్డి లాంటివి తింటూ కాలం గడిపేస్తున్నాయట. అయితే ఈ ఏనుగులు.. కోర్టు ప్రహసనాన్ని చూసేందుకు మాత్రం కోర్టు వద్దకు జనం తండోపతండాలుగా వచ్చారు.