jummerath bazar
-
రాజాసింగే రాయితో కొట్టుకున్నాడు.. : పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : జుమ్మెరాత్ బజార్లో స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహాన్ని పెట్టేందుకు రాజాసింగ్ ప్రయత్నించారని వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. అనుమతి లేకుండా విగ్రహం పెట్టడంతో అడ్డుకున్నామన్నారు. రాజా సింగ్‌పై తాము ఎలాంటి దాడి చేయలేదని పేర్కొన్నారు. రాజా సింగే తనకు తాను రాయితో కొట్టుకున్నాడని చెప్పారు. దీనికి సంబంధించి వీడియో ఆధారాలు ఉన్నాయని తెలిపారు. పోలీసులపై రాజాసింగ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. కాగా, దీనికి సంబంధించి వీడియోను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్‌కుమార్ ట్విటర్లో పోస్ట్ చేశారు. -
‘ప్రజాప్రతినిధిని రక్తమోడేలా కొట్టడం దారుణం..’
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఒక ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమానుషమని, ప్రజాప్రతినిధిని రక్తమోడేలా కొట్టడం దారుణమని ట్విటర్లో పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజా పాలన ఉందా.. రజాకార్ల పాలన కొనసాగుతుందా..? అని ధ్వజమెత్తారు. 'పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను వారి నివాసంలో పరామర్శించాను. వారు నిన్న రాత్రి జరిగిన సంఘటనను వివరించారు. రాజాసింగ్ త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఒక ఎమ్మెల్యేకే భద్రత లేకుంటే.. ఇక సామాన్యులకు పరిస్థితి ఏంటి. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేకే టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు తెగబడుతుంది. దాడులతో బీజేపీని భయపెట్టాలనుకుంటే కుదరని పని. త్యాగాలతో ఎదిగిన చరిత్ర బీజేపీది. రాజాసింగ్‌పై దాడికి పాల్పడిన గోషామహల్ ఏసీపీ ఎం.నరేందర్, అసిఫ్ నగర్ ఏసీపీ నర్సింహా రెడ్డి, షాయనాత్ గంజ్ ఎస్సై గురుమూర్తి, రవి కుమార్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జరిగిన ఘటనపై పోలీస్ యంత్రాంగం బేషరతుగా క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు. -
లాఠీచార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు!
సాక్షి, హైదరాబాద్ : పోలీసుల లాఠీచార్జ్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌కు గాయాలు అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని జుమ్మెరాత్ బజార్‌లోని స్వాతంత్ర్య సమరయోధురాలు రాణి అవంతి భాయ్ విగ్రహ ప్రతిష్టాపన చేసేందుకు బుధవారం ఆర్థరాత్రి అక్కడి స్థానికులు ప్రయత్నించారు. అయితే విగ్రహానికి ప్రభుత్వ అనుమతి లేదని గోషామహాల్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానికులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. రాజాసింగ్ వచ్చిన అనంతరం అప్పటికే పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వారిపై రాళ్లు రువ్వారు. అయితే వీరిని చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు లాఠీచార్జీ చేశారని, రాజాసింగ్‌తోపాటు పలువురుకి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా అక్రమంగా లాఠీచార్జీ చేశారని పోలీసులపై ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకోవడం అరాచకమని నిప్పులు చెరిగారు. ఈఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. మరోవైపు రాజాసింగ్‌పై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ విభాగం ట్విటర్లో పేర్కొంది. తెలంగాణలో టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ, అరాచక పాలన పరాకాష్టకు చేరిందని స్పష్టమవుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
జుమ్మెరాత్ బజార్ ఆలయంలో చోరీ
హైదరాబాద్ క్రైం: గుడికి వచ్చి భక్తితో దండం పెట్టుకోకుండా దేవుడి తలపై ఉన్న కిరీటాన్నే ఎత్తుకెళ్లాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని ఆబిడ్స్ పరిధిలోని జుమ్మెరాత్ బజార్‌లోని బాలాజి దేవాలయంలో చోటుచేసుకుంది. ఆలయంలో ఎవరు లేని సమయంలో గుర్తుతెలియని దుండగుడు స్వామివారి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. పూజలు నిర్వహించడానికి వచ్చిన పూజారి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు.