లుపిన్ లాభాలు జంప్
ముంబై: ముంబైకి చెందిన ఫార్మా దిగ్గజం లుపిన్ ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ1 ఫలితాల్లో నికర లాభాల్లో దూసుకుపోయి విశ్లేషకుల అంచనాలను ఓడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఆకర్షణీయ ఫలితాలను నమోదు చేసింది. లుపిన్ నికర లాభం 55 శాతం జంప్‌చేసి రూ. 882 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం కూడా 41 శాతం పెరిగి రూ. 4,439 కోట్లకు చేరింది. నిర్వహణ లాభం(ఇబిటా) 57 శాతం దూసుకెళ్లి రూ. 1308 కోట్లుకాగా, ఇబిటా మార్జిన్లు 26.13 శాతం నుంచి 29.46 శాతానికి ఎగశాయి. ఇతర నిర్వహణ లాభం సైతం 67 శాతం పెరిగి రూ. 126 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ, మార్కెట్ లో లుపిన్ షేరు దాదాపు 2 శాతం క్షీణించింది. మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం లుపిన్ నష్టాలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.