అంతరంగమే ఆయన కథనరంగం
జూన్ 14న బుచ్చిబాబు జయంతి
కథని, నవలని కళాప్రక్రియగా తీర్చిదిద్దిన ప్రారంభ ఆధునిక రచయితల్లో బుచ్చిబాబు ఒకడు. ఆధునిక రచయితకు వ్యక్తి బాహ్య జీవితం కాదు ప్రధానం. వొక వ్యక్తి బాహ్య జీవితాన్ని అతని ఆంతరంగిక జగత్తు– ఆ జగత్తులోని విభిన్న శక్తులకు కుదిరిన సయన్వయం నిర్ణయిస్తుంది. ఆ సమన్వయం సాధించే వరకు తనతో తానూ, బాహ్య ప్రపంచంతోనూ యేదోరకంగా సంఘర్షణ పడ్తూనే ఉంటాడు. ఆ సంఘర్షణని చిత్రించే ప్రయత్నం చేస్తారు ఆధునిక రచయితలు.
ఆధునిక తెలుగు వచన సాహిత్యంలో అతి నవీన మార్గం త్రొక్కిన రచయిత బుచ్చిబాబు. ఆయనకు ముందు ప్రచారంలో ఉన్న వచన సాహిత్యమంతా– ముఖ్యంగా కథ, నవల, కాల్పనికోద్యమంతో ముడిపడినట్టివే. తను నివసిస్తున్న సమాజాన్ని రచయిత నిరసించటం, తను నమ్మిన విధంగా ఈ సమాజాన్ని సంస్కరించాలనే ఆవేశంతో వ్రాయటం కాల్పనికోద్యమ ముఖ్య లక్షణాలు. రచయిత నమ్మిన అభిప్రాయాల్ని ప్రచారం చెయ్యటానికి సాహిత్యం ఒక సాధనంగా ఉండేది. ఈ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఎంతో మందిని ప్రభావితం చేసిన ఇద్దరు ముఖ్యులైన రచయితలు – విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వెంకటాచలం.
వీరిద్దరూ ప్రచారం చేసిన భావాల్లో ఎంతో తీవ్రమైన వైరుధ్యం కన్పించినా– స్థూలంగా వీరిద్దరూ వొకే తరగతికి చెందిన రచయితలు. ధర్మాన్ని పునరుద్ధరించాలని విశ్వనాథ, స్త్రీ స్వాతంత్య్రం, లైంగిక స్వాతంత్య్రం కావాలని చలం కథలూ, నవలలూ రాశారు. అంతేకాని కథని, నవలని కళాప్రక్రియలుగా వాళ్ళు భావించలేదు. నిజమైన కళ ప్రచారం చెయ్యదు. జీవితాన్ని చిత్రిస్తుంది. ఆ చిత్రణ ఒక రసానుభూతిని కల్గిస్తుంది. ఒక జీవిత సత్యాన్ని పాఠకుడిలో ఉద్ధీపింపజేస్తుంది. ఆ చిత్రణ, ఆ రసానుభూతి, ఆ జీవిత సత్యం సమాజ శ్రేయస్సుకు పరోక్షంగా ఉపకరించవచ్చు. బుచ్చిబాబు కథని, నవలని ఇలాంటి కళాప్రక్రియగా తీర్చిదిద్దిన ప్రారంభ ఆధునిక రచయితల్లో ఒకడు.
బుచ్చిబాబు తన కథల ద్వారా, నవల ద్వారా యేదోవొక భావాన్ని ప్రచారం చెయ్యటం ఆశయంగా పెట్టుకోలేదు. మానవ జీవితంలోని వొకానొక అంశాన్ని చిత్రించే కళాస్వరూపాలుగా వాటిని స్వీకరించాడు. ఇది కాల్పనికోద్యమం తర్వాత తెలుగులో వచ్చిన ఆధునిక మార్గం. కాల్పనికోద్యమం నుండి తెలుగు సాహిత్యం యెక్కిన మరో మెట్టు. ఇది ఆధునిక యుగం కాబట్టి ఈ యుగంలో వచ్చిన సాహిత్యమంతా ఆధునిక సాహిత్యం కాదు. ఆధునిక రచయితలకు అంతర్ దృష్టి ప్రధానం.
జీవితాన్ని స్థూలంగా కాదు– సూక్ష్మంగా పరిశీలించి, అనాది నుండి నేటి వరకు మానవుడు వివిధ రంగాల్లో సాధించిన విజ్ఞానం ద్వారా వివిధ దృక్కోణాల నుండి చూడాలి. ఇదివరకు రచయితలు తమ పాత్రల బాహ్య జీవితంపై దృష్టి ఎక్కువగా కేంద్రీకరించేవాళ్ళు. ఆధునిక రచయితకు వ్యక్తి బాహ్య జీవితం బాహ్య చేష్టలు కాదు ప్రధానం. వ్యక్తుల ఆంతరంగిక జగత్తులో యెన్నో శక్తులు పరస్పరం పోట్లాడుకుంటాయి. వొక వ్యక్తి బాహ్య చేష్టలకు ఈ ఆంతరంగిక జగత్తుతో సంబంధం వుంది. వొక వ్యక్తి బాహ్య జీవితాన్ని అతని ఆంతరంగిక జగత్తు– ఆ జగత్తులోని విభిన్న శక్తులకు కుదిరిన సయన్వయం నిర్ణయిస్తుంది.
ప్రతీ వ్యక్తి తన ఆంతరంగిక జగత్తులో– అనగా తనలో తాను వొక సమన్వయాన్ని కుదుర్చుకోవటం, బాహ్యప్రపంచంతోనూ అలాంటి సమన్వయాన్నే కుదుర్చు కోవటం ద్వారా నిజమైన శాంతి సౌఖ్యాలను సాధించగల్గుతాడు. ఆ సమన్వయం సాధించే వరకు తనతో తానూ, బాహ్య ప్రపంచంతోనూ యేదోరకంగా సంఘర్షణ పడ్తూనే ఉంటాడు. ఆ సంఘర్షణని చిత్రించే ప్రయత్నం చేస్తారు ఆధునిక రచయితలు. ఈ ఆధునికోద్యమం 1914 తర్వాత ఆంగ్ల సాహిత్యంలో వచ్చింది. జేమ్స్ జాయిస్, వర్జీనియా ఉల్ఫ్, డి.హెచ్.లారెన్స్ మొదలైన రచయితలు ఈ ఉద్యమాన్ని నడిపి ముఖ్యంగా నవలని గొప్ప కళాప్రక్రియగా తీర్చిదిద్దారు. ఈ ఉద్యమాన్నే 1940 తర్వాత తెలుగులో ప్రవేశపెట్టిన రచయితల్లో ముఖ్యుడు బుచ్చిబాబు. ఆయన ‘చివరకు మిగిలేది’ తెలుగు ఆధునిక నవలా సాహిత్యంలో వొక మైలురాయి.
‘చివరకు మిగిలేది’ బుచ్చిబాబు వ్రాసిన యేకైక నవల. పరవళ్ళు త్రొక్కే గొప్ప భావోద్వేగంతో వ్రాయబడిన నవల. తనని కలవరపెట్టిన కొన్ని సమస్యల నుండి విముక్తి పొందడానికి ఇది వ్రాసానని రచయిత చెప్పుకున్నాడు. చివరకు మిగిలేది వ్రాసి పది సంవత్సరాలు వట్టిపోయాను అన్నాడు. తన ఊహాశక్తిని, సృజనాత్మక శక్తిని, భావనాజగత్తుని సంపూర్ణంగా ‘చివరకు మిగిలేది’కి సమర్పించుకున్నాడు. బుచ్చిబాబు ఇంకో నవల రాయలేకపోయాడంటే ఆశ్చర్యం లేదు. ఒక చోట సోమర్సెట్ మామ్ అన్నాడు: ‘రచయిత తనకున్న సృజనాత్మక శక్తి అనే ఆస్తిని ఎంతో పొదుపుగా వాడుకోవాలి. ఒకే రచనలో ఆ ఆస్తినంతా ఖర్చుపెడితే మరో రచనకు ఏమీ మిగలదు’. బుచ్చిబాబు లేఖిని నుండి మరో నవల రూపకల్పన చేసుకుంటుందని ఎందరు ఎంత ఆశించినా రెండో నవలకు ప్రయత్నమే చెయ్యలేదాయన.
‘చివరకు మిగిలేది’ 1946లో వ్రాయబడినా, పుస్తక రూపంలో 1952లో వచ్చింది. నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది యువ రచయితల్ని, విమర్శకుల్ని ప్రభావితం చేసింది. ఎన్నిసార్లు చదివినా క్రొత్త అర్థాల్ని, క్రొత్త ధ్వనుల్ని స్ఫురింపజేసే నవల ఇది. యేదో ఒక భావాన్ని పాఠకుడి మీద రుద్దటం కాకుండా జీవితాన్ని వివిధ దృక్కోణాల నుండి చూపెడుతుంది.
బుచ్చిబాబు ఒక నవల, కొన్ని నాటకాలు, ఎన్నో వ్యాసాలు రచించినప్పటికీ ఆయన ప్రధానంగా కథకుడు. 80కి పైగా కథలు రచించాడు. ఏ ఇతర తెలుగు కథకుడు స్పృశించని ఇతివృత్తాల్ని బుచ్చిబాబు తన కథలకు స్వీకరించాడు. ఆయన కథలన్నింటిలోనూ పాత్రల అంతరంగాలు, అధోలోకాలే చిత్రించబడ్డాయి. ఆయన స్పృశించిన పురుష పాత్రల్లోనూ, స్త్రీ పాత్రలోనూ ఏదో ఒక మానసిక సమస్య ఉంటుంది. ఆ సమస్యేమిటో ఆ పాత్రలకు తెలియదు. రచయిత కూడా ఆ సమస్యల గూర్చి స్పష్టంగా చెప్పడు. చెప్పీ చెప్పనట్లుగా చెప్పి ఆ సమస్యేమిటో పాఠకులను అర్థం చేసుకొమ్మంటాడు.
‘కొందరు రచయితలు తమ పాత్రల మనస్తత్వాలను పూర్తిగా పరామర్శించి, వితర్కించి, ప్రతీది బైట పెట్టడం ఒక ఫ్యాషన్‌గా పరిగణిస్తున్నారు. కానీ ఇది పొరపాటనుకుంటాను. ఎవరూ ఎవరికి పూర్తిగా అర్థమవరు. అర్థం అవకపోవడంలోనే ఒక వైచిత్రి ఉంది. ఈ వైచిత్రిని ప్రదర్శించాలన్న లక్ష్యాన్ని రచయిత వొదులుకోకూడదు’ అంటాడు బుచ్చిబాబు ‘కథ దాని కమామీషు’ వ్యాసంలో. బుచ్చిబాబు రచించిన చాలా కథల్లో మానవ ప్రవృత్తిలోని ఈ వైచిత్రినే చిత్రించాడు. ఈ చిత్రణ ఎక్కడా వాచ్యంగా ఉండదు.
‘కథ మళ్లీ మళ్లీ చదివించే ఖండకావ్యంలా ఉండా’లనేది బుచ్చిబాబు దృఢ అభిప్రాయం. అందుకే ఆయన కథలన్నింటిలోనూ కళ్లు జిగేలుమనిపించే ప్రకృతి వర్ణనలుంటాయి. శబ్దాలతో రమణీయ చిత్రాలను నిర్మించడం ఉంటుంది. ఆయన స్వయంగా చిత్రకారుడు కావడం వల్ల కుంచెతోటే కాదు, కలం నుండి జాలువారే శబ్దాలతో కూడా చిత్రాల్ని పాఠకుడి కళ్ల ముందు ఎలా ఆవిష్కరించాలో ఆయనకు తెలుసు.
బుచ్చిబాబు కథల్లో కనిపించే మరో లక్షణం మానవ జీవితాన్ని గూర్చిన అనేక వ్యాఖ్యానాల్ని, సూక్తుల్ని పాత్రల నోటివెంట వినిపించడం. ‘అసలు ఈ లోకంలో ఎవరూ ఎవర్ని ప్రేమించలేరు. మనుషులకి కావాల్సింది ప్రేమ కాదు. ప్రేమ శరీరానికి కావాలి. హృదయం కోరేది కాస్తంత దయ, కొంచెం ఆప్యాయత, ఆదరణ అంతే’ అంటాడు కరుణాకారం ‘నిరంతర త్రయం’ కథలో. ఇలాంటి వ్యాఖ్యానాలు ఆయన కథలన్నింటిలోనూ కనిపిస్తాయి. తిలక్ అన్నట్టు ఆయన కథల్లో పాత్రల అంతరాంతర జ్యోతిస్సీమలు బహిర్గతం అవుతాయి. ‘ఎల్లోరాలో ఏకాంత సేవ’, ‘అరకులోయలో కూలిన శిఖరం’, ‘మేడమెట్లు’, ‘కాగితం ముక్కలు – గాజు పెంకులు’, ‘ఆశాప్రియ’, ‘నన్ను గూర్చి కథ వ్రాయవు!’, ‘బీ’, ‘తడిమంటకి పొడినీళ్లు’ మొదలైన కథలు తెలుగు పాఠకుల హృదయాల్లో తరతరాల వరకు పలుకుతూనే ఉంటాయి.
- అంపశయ్య నవీన్