ప్రకృతితో ముడిపడిన కోయభాష
అంతర్రాష్ట్ర కోయ బాలసాహిత్య సమ్మేళనంలో ఆదివాసీ కవులు
చింతూరు :
ఆదివాసీలు మాట్లాడే కోయభాషలో ఎంతో గొప్పదనం ఉందని, ఈ భాషలోని పదాలు ప్రకృతితో ముడిపడి ఉంటాయని పలువురు అదివాసీ కవులు అన్నారు. కోయత్తోర్ బాట, కోయ సమాజ్‌ల ఆధ్వర్యాన చింతూరు మండలం రామన్నపాలెంలో మూడు రోజుల అంతర్రాష్ట్ర కోయ బాల సాహిత్య సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ఆదివాసీ కవులు మాట్లాడుతూ, కోయ భాషను బాహ్య ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో కోయ బాల సాహిత్యాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మధ్య గోండ్వానా ప్రాంతమంతా కోయజాతి నిండి ఉందని, మాతృభాష ప్రాధాన్యాన్ని వీరికి తెలియజేయాల్సి ఉందని అన్నారు. ఆదివాసీలు నివసించే ఆరు రాష్ట్రాల్లో కోయ బాల సాహిత్యం ప్రవేశపెడితే ప్రాథమిక దశలోనే ఆదివాసీ పిల్లలకు మాతృభాష ఔన్నత్యం తెలుస్తుందన్నారు. త్వరలో జాతీయ స్థాయిలో సైతం ఇలాంటి సమ్మేళనాలను నిర్వహిస్తామని వారు అన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువ రచయితలు కోయభాషలో రచించిన పద్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అఖిల భారత గోండ్వానా మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు సిడాం అర్జూ, ఆదివాసీ రచయితల సంఘం కార్యదర్శి మైపతి అరుణ్‌కుమార్, కట్టం సత్యం, పద్దం అనసూయ, యాదయ్య, మురళి, భీమమ్మ, అశోక్ తదితరులు పాల్గొన్నారు.