junior civil judge exams
-
ప్రశాంతంగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలు
పెదగంట్యాడ (గాజువాక)/విజయవాడ రూరల్/గుంటూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గాజువాకలోని బీసీ రోడ్డులో ఉన్న ఎస్వీఎస్ టెక్నాలజీ అండ్ సొల్యూషన్స్‌లో మొత్తం 140 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 110 మంది హాజరయ్యారు. 30 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ పరిశీలించి, అక్కడి ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే, విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ఉన్న వికాస్ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ పరిశీలించారు. పరీక్ష కేంద్రాన్ని పరిశీలించి వెళ్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు తదితరులు ఆయనతో పాటు జిల్లా జడ్జి జి.రామకృష్ణ ఉన్నారు. ఈ కేంద్రంలో మొత్తం 50 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 39 మంది మాత్రమే పరీక్ష రాశారని వికాస్ కళాశాలల చైర్మన్ నరెడ్ల నర్సిరెడ్డి తెలిపారు. అలాగే, గుంటూరు రూరల్ మండలం చల్లావారిపాలెంలోని బాలాజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బి బ్లాక్‌లో, వట్టిచెరుకూరు మండలం మలినేని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పరీక్ష కేంద్రాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.గంగారావు పరిశీలించారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ఆలపాటి గిరిధర్, జిల్లా జడ్జి రవీంద్రబాబు ఉన్నారు. -
ప్రశాంతంగా ముగిసిన జేసీజే పరీక్షలు
హైదరాబాద్: మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జీల నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దరఖాస్తు చేస్తుకున్న 3069 మందిలో 2386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు డీసీపీలు, ముగ్గురు అడిషనల్ డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 90 మంది ఎస్ఐలు, 25 మంది ఏఎస్ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు, 200 మంది రిజర్వ్ పోలీసులు విధులు నిర్వహించారు. కాగా,ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి వెంటనే తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు పరీక్షలను అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్ల కార్డులు ప్రదర్శించారు. వెంటనే పోలీసులు వారిని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.