హైదరాబాద్: మీర్‌పేటలోని టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జీల నియామక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. దరఖాస్తు చేస్తుకున్న 3069 మందిలో 2386 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ముగ్గురు డీసీపీలు, ముగ్గురు అడిషనల్ డీసీపీలు, 20 మంది ఏసీపీలు, 40 మంది సీఐలు, 90 మంది ఎస్‌ఐలు, 25 మంది ఏఎస్‌ఐలు, 600 మంది కానిస్టేబుళ్లు, 200 మంది రిజర్వ్ పోలీసులు విధులు నిర్వహించారు.
కాగా,ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి వెంటనే తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు కోర్టులకు సంబంధించిన ఎలాంటి పరీక్షలు నిర్వహించవద్దని డిమాండ్ చేస్తూ కొందరు న్యాయవాదులు పరీక్షలను అడ్డుకునేందుకు యత్నించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్ల కార్డులు ప్రదర్శించారు. వెంటనే పోలీసులు వారిని మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు.