జూనియర్ కళాశాలల బంద్ విజయవంతం
అనంతపురం ఎడ్యుకేషన్ : రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏబీవీపీ జిల్లా శాఖ శనివారం నిర్వహించిన జూనియర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. బంద్ సందర్భంగా ఆందోళనకారులు స్థానిక సప్తగిరి సర్కిల్ వద్ద అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలియజేశారు. ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. బ్రాండ్ పేరుతో జరుగుతున్న మోసాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ యాజమాన్యాల కబంధహస్తాల నుంచి ఇంటర్ విద్యను కాపాడాలని కోరారు.
ప్రభుత్వమే నిర్దిష్టమైన ఫీజు విధానాన్ని అమలు చేయాలన్నారు. ఇంటర్ కళాశాలల అడ్మిషన్లు, విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ కళాశాలలను పటిష్ట పరిచి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో నగర సంఘటన కార్యదర్శి గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరి, నాయకులు వెంకట్, కిరణ్, మోహన్, ముక్తేష్, అమన్ తదితరులు పాల్గొన్నారు.