జూడాల మానవహారం
పన్నెండో రోజుకు చేరిన సమ్మె
విజయవాడ : తప్పనిసరిగా గ్రామీణ సర్వీసు చేయాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవో 107 రద్దు చేయాలని, తమ డిగ్రీలు తక్షణమే రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె సిద్ధార్థ వైద్య కళాశాలలో 12వ రోజు కొనసాగింది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు సిద్ధార్థ వైద్య కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న జూడాలు బుధవారం పాత ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదుట మానవహారం నిర్వహించారు. దీంతో నలువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
అసోసియేషన్ నాయకుడు డాక్టర్ తనోజ్ , డాక్టర్ కార్తీక్, డాక్టర్ క్రాంతికుమార్, స్నిగ్థ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జూనియర్ వైద్యులు సమ్మె చేయడంతో అవుట్పేషెంట్లకు ఇబ్బందులు తప్పడం లేదు. వార్డులో చికిత్స పొందుతున్న వారిని సైతం పర్యవేక్షించే వారు లేకపోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోననే ఆందోళనతో అధికారులు తలలు పట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.