ఉస్మానియా వైద్య కళాశాలలో ఉద్రిక్తత
జూనియర్ డాక్టర్ల అరెస్టు, విడుదల
కళాశాల భవనం ఎక్కి ఆందోళన చేసిన జూడాలు
హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోఠిలోని ఉస్మానియా వైద్య కళాశాలలో సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లను గురువారం పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వం, డీఎంఈ లకు వ్యతిరేకంగా జూడాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నలుగురు జూడాలు కళాశాల భవనం పైకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. జూడాల నాయకులు, పోలీసులు సముదాయించడంతో కిందికి దిగారు. అరెస్టులో భాగం గా పోలీసులు తమపై దురుసుగా వ్యవహరించారని సెల్ఫోన్లు లాక్కొని, దీక్ష శిబిరంలో టెంట్లను తొలగించారని మండిపడ్డారు. పోలీసు లు కళాశాల గోడలు దూకి దీక్ష శిబిరంలో నిద్రపోతున్న తమను బలవంతంగా అరెస్టు చేశారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం తమ సమ్మెను భగ్నం చేసేందుకు పోలీసులను ఉసిగొల్పుతుందన్నారు. పోలీసులు 1022 సెక్షన్ను సాకుగా చూపి తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జూడాల నేతలు స్వప్నిక, నరేశ్ ఆరోపించారు. ఏడాదిపాటు గ్రామీణ ప్రాంతంలో పనిచేయాలనే నిబంధన రద్దు చేయాలని కోరారు. కాగా, శుక్రవారంతో జూడాల నిరసన 26వ రోజుకు చేరింది.