'నగ్న వీడియో' కేసు: యాంకర్ కు రూ.370 కోట్లు
నాష్ విల్లే: మారియట్ హోటల్ గదిలో తాను దుస్తులు మార్చుకుంటుండగా ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి ఇంటర్నెట్లో పెట్టడంపై న్యాయపోరాటానికి దిగిన టీవీ చానెల్ యాంకర్ ఎరిన్ ఆండ్రూస్ కు గొప్ప ఊరటలభించింది. అమెరికా స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ చానెల్ యాంకరైన ఎరిన్ ను వీడియో తీయడమేకాక, సోషల్ నెట్ వర్క్ లో పోస్ట్ చేసి ఆమెను క్షోభకు గురిచేశారంటూ ప్రతివాదులపై మండిపడ్డ కోర్లు.. నష్టపరిహారంగా ఎరిన్ కు 55 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.370 కోట్లు) చెల్లించాలని తీర్పుచెప్పింది.
సోమవారం తల్లిదండ్రులతో కలిసి కోర్టుకు హాజరైన ఎరిన్ తీర్పు అనంతరం కాస్త ఊరటచెందినట్లు కనిపించారు. కోర్టు ఆవరణలో వేచిఉన్న తన అభిమానులకు ఆటోగ్రాఫులిచ్చారు. ఈ ఘటనతో నేను అవమాన భారంతో కుంగిపోయాననీ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని విచారణ సందర్భంగా కోర్టు జ్యూరీ ముందు ఎరిన్ తన వాంగ్మూలాన్నిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు.
2008లో ఈఎస్పీఎన్ చానెల్‌కు పనిచేస్తున్నప్పుడు ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కవర్ చేయడం కోసం ఎరిన్ అమెరికాలోని వాండర్బిల్ట్ యూనివర్సిటీ సమీపంలోని మారియట్ నేష్‌విల్లే హోటల్లో బసచేసింది. పక్క గదిలోనే బసచేసిన మైకేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి ఎరిన్ గదిలోకి రంధ్రం చేసి..ఆమె డ్రెస్ మార్చుకుంటుండగా వీడియో తీశాడు. ఈ వీడియో తర్వాత ఇంటర్నెట్లో ప్రత్యక్షమవడంతో పబ్లిసిటీ కోసం ఎరినే స్వయంగా ఈపని చేసిందంటూ ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై ఎరిన్ కోర్టుకెక్కడంతో అసలు విషయం బయటపడింది.
ఎరిన్ కు చెల్లించాల్సిన జరిమానాను ప్రధాన దోషి అయిన మైకేల్ డేవిడ్, రెండో దోషి మారియట్ హోటల్ గ్రూపులు చెరిసగం ఇవ్వాలని కోర్టు పేర్కొంది. కాగా, హోటల్ నిర్వహణను రెండు కంపెనీలు చూస్తున్నందున ఆ రెండూ ఎంతెంత శాతం చెల్లించాలనే నిర్ణయాన్ని వారికే వదిస్తున్నట్లు కోర్లు చెప్పింది. ఎట్టకేలకు కేసు గెలవడంతో ఏళ్లుగా తాను అనుభవిస్తున్న క్షోభ నుంచి ఎరిన్ విముక్తురాలైనట్లైంది.