లైబ్రేరియన్లను టీచర్లుగా గుర్తించండి
విశ్వవిద్యాలయాల్లో పనిచేసే లైబ్రేరియన్లు టీచర్ల నిర్వచన పరిధిలోకి వస్తారని హైకోర్టు తేల్చి చెప్పింది. అందువల్ల వారు 60 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యామయూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ బి.శివశంకరరావు ఇటీవల తీర్పు వెలువరించారు. లైబ్రేరియన్లను నాన్-వెకేషన్ అకడమిక్ స్టాఫ్‌గా పరిగణిస్తూ ఉన్నత విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ అబ్దుల్ హకీమ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని సింగిల్ జడ్జి కొట్టేశారు. దీనిపై హకీం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై తుది విచారణ జరిపిన జస్టిస్ సంజయ్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. చట్ట సవరణల అనంతరం లైబ్రేరియన్ల సర్వీసు నిబంధనల్లో గణనీయ మార్పులు వచ్చాయని ధర్మాసనం తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రిసెర్చ్ (ఐసీఏఆర్) సిఫారసుల మేరకు ఎంఎస్సీ, పీహెచ్డీ విద్యార్థులు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సెస్సైస్ కోర్సు చేయడం తప్పనిసరి చేయడం జరిగిందంది.
ఈ నేపథ్యంలో లైబ్రేరియన్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పరిగణించడం మొదలుపెట్టారని తెలిపింది. వ్యవసాయ యూనివర్సిటీల చట్టం ప్రకారం టీచర్ నిర్వచన పరిధిలోకి ప్రొఫెసర్లు, రీడర్, లెక్చరర్లు, యూనివర్సిటీ నియమించి, గుర్తించిన ఇతర వ్యక్తులు వస్తారంది. ఈ పరిస్థితుల్లో లైబ్రేరియన్లు టీచర్ల నిర్వచన పరిధిలోకి వస్తారని, వారు కూడా 60 ఏళ్ల వరకు సర్వీసులో కొనసాగవచ్చునని తెలిపింది.