Justice chalamesvar
-
తప్పును ఎత్తిచూపకపోతే సమాజం బాగుపడదు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అవనిగడ్డ: తప్పును తప్పని చెప్పకపోతే రాజ్యాంగ వ్యవస్థకు శ్రేయస్కరం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ బార్ అసోసియేషన్ హాలులో దివంగత న్యాయవాది కంఠంనేని రవీంద్రరావు జ్ఞాపకార్థం ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జస్టిస్ చలమేశ్వర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో అడుగు పెట్టాలంటే ఒక ఎంపీ రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్లు ఖర్చుపెడు తున్నారని ఎన్నికల సంఘం మాజీ అధికారి హెచ్ఎస్ బ్రహ్మ ఇటీవల చెబితే చాలామంది సీరియస్‌గా తీసుకోకపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. అనంతరం జస్టిస్ చలమేశ్వర్ ను సత్కరించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అందె శ్రీరామకృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
సత్యాన్ని గుర్తించడమే ప్రధాన విధి
న్యాయవాదులు, న్యాయమూర్తులకు జస్టిస్ చలమేశ్వర్ సూచన హైదరాబాద్: న్యాయవాదులు, న్యాయ మూర్తులు సత్యాన్ని గుర్తించడమే ప్రధాన విధిగా పనిచేయాలని సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జె.చలమేశ్వర్ సూచించారు. ఏ కేసులోనైనా సత్యం ఏమిటో తెలుసుకోవాల న్నారు. ఇది మూడు రకాలుగా... కేసు వేసిన వైపువారి నుంచి సత్యం, ఆధారపడి ఉన్నవారి సత్యం, జడ్జి దృష్టితో ఉన్న సత్యం ఉంటుందన్నారు. గచ్చిబౌలి శాంతిసరోవర్ లో బ్రహ్మకుమారీస్, ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిళ్లు, న్యాయ శాఖ, వివిధ కోర్టుల న్యాయవాదుల సంఘాల సంయుక్త ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన న్యాయవాదులు, న్యాయ మూర్తులు, అధికారుల జాతీయ సదస్సును ఆదివారం ఆయన ప్రారంభించారు. జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ... ‘న్యాయ వృత్తిలో ఉన్నవారు మాట్లాడే ప్రతిమాట సమగ్ర పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడా లి. ప్రస్తుతం ప్రతిఒక్కరూ శాంతిమయ జీవితం కావాలనుకొంటున్నారు. శాంతి అత్యంత అవసరమైనదే. కానీ... శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ముందుగా సమాజం ఆర్డర్లో ఉండాలి. సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోగలగాలి. భావోద్వేగాలకు అతీతులుగా ఉండాలి. అది బ్రహ్మకుమారీస్ సంస్థ నేర్పించే మెడిటేషన్ ద్వారా వస్తుందని నమ్ముతున్నా’అన్నారు. సుఖదుఃఖాల కలయికే ఈ ప్రపంచం... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ మాట్లాడుతూ... సుఖ దుఃఖాల కలయికే ఈ ప్రపంచమన్నారు. ‘ఒడి దొడుకులతో కూడుకున్న ఈ ప్రపంచంలో మనసును ప్రశాంతంగా ఉంచడం కష్టం. చదువుకున్నవారికి ఉద్యోగాలుండవు. తిందా మంటే ఆహారం రుచి ఉండదు. విద్యలో నైతి కత ఉండదు. ఇలాంటి సమాజంలో శాంతి నెలకొనాలంటే స్వార్థ చింతన, అహంకారం వంటివి శాశ్వతంగా వదులుకోగలగాలి’అని జస్టిస్ రామసుబ్రమణియన్ చెప్పారు. సుఖ శాంతిమయ జీవనం కోసం ప్రతి ఒక్కరికీ మెడిటేషన్ అవసరమని జస్టిస్ సురేష్కుమార్కైత్ అన్నారు. మనలోని బ్యాటరీ ఫుల్చార్జిలో ఉంటేనే ఉత్సాహంతో పనిచేయగలమని, అందుకు మనసును ప్రశాంతంగా ఉంచుకో వాలన్నారు. న్యాయవాదులు, జడ్జీలు రోజూ ఉదయం కోర్టు వ్యవహారాలు మొదలుపెట్టే ముందు పది నిమిషాలు ధ్యానం చేయాల్సిన అవసరముందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు చెప్పారు. ప్రస్తు తం ప్రతి చిన్న విషయానికీ కోర్టుకు వస్తున్నా రని, అందుకు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నా మన్నారు. విలువలను పూర్తిగా కోల్పోతున్నా మని, విలువల ఆధారిత పునాది అవసరమ న్నారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, యూరోపియన్ బీకే సెంటర్స్ డైరెక్టర్ బీకే జయంతి, బ్రహ్మకుమారీస్ జూరిస్ట్ వింగ్ జాతీయ డైరెక్టర్ రాజయోగిని పుష్ప పాల్గొన్నారు. -
మన వైభవాన్ని ప్రపంచానికి చాటాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పిలుపు భాష సమాజానికి వారధి: జస్టిస్ లావు నాగేశ్వరరావు గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రదానం సాక్షి, విశాఖపట్నం: ‘‘పలు రాజకీయ కారణాలతో కొత్త రాష్ట్రంలోకి వచ్చాం. మళ్లీ మన (తెలుగు వారి) వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కళాకారులు, సాహితీ వేత్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని ఏయూ అసెంబ్లీ హాల్లో శనివారం రాత్రి లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డును సాహితీ వేత్త గోరటి వెంకన్నకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడారు. మారుతున్న తరానికి అనుగుణంగా గోరటి వెంకన్న చక్కటి రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. సాహితీవేత్తలతో పాటు ఇతర రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు సైతం లోక్‌నాయక్ ఫౌండేషన్ అవార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశంలోనే మంచి గుర్తింపు లభించే స్థాయికి ఈ పురస్కారాన్ని తీసుకెళ్లాలన్నారు. కాలంతో పాటు కళారూపాల్లో, కళలు సాధన చేసిన వారి తరగతుల్లోనూ మార్పు వచ్చిందని చెప్పారు. కళలను ఆస్వాదించడం మానవ లక్షణమని, దానికి పెద్దగా చదువు అక్కర్లేదని, మనిషైతే చాలని వెల్లడించారు. భాష సమాజానికి వారధి లాంటిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు చెప్పారు. గోరటి వెంకన్న పాటల్లో సందేశం ఉంటుందన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ... 13 ఏళ్లుగా సాహితీరంగంలో విశిష్ట వ్యక్తులకు అవార్డులను అందజేస్తున్నామన్నారు. రెండు రాష్ట్రాల ఆత్మ ఒకటే తెలుగు రాష్ట్రాలు విడిపోయినా ఈ రెండింటి ఆత్మ ఒకటేనని అవార్డు గ్రహీత గోరటి వెంకన్న తెలిపారు. ఉత్తరాంధ్రలో రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావిశాస్త్రి) తనకు ప్రేరణ అని, దేవులపల్లి కృష్ణశాస్త్రి, దువ్వూరి రామిరెడ్డి తనకు గురువులని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌జాస్తి చలమేశ్వర్ పంచెకట్టులో ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు. పంచెకట్టులో జస్టిస్ చలమేశ్వర్‌ను చూస్తుంటే దివంగత నేతలు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఎన్టీఆర్‌లు గుర్తుకొస్తున్నారని చెప్పారు. గోరటికి అవార్డు ప్రదానం తొలుత గోరటి వెంకన్నకు లోక్‌నాయక్ ఫౌండే షన్ అవార్డును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ లావు నాగే శ్వరరావు, జాతీయ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ జి.రఘురాం, మంత్రి గంటా శ్రీనివాస రావు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ల సమక్షంలో ప్రదానం చేశారు. పురస్కారం కింద రూ.1.50 లక్షలు అందజేశారు. -
‘వ్యాపం’ మెడికోలు ఆర్మీలో పనిచేయాలి
♦ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ చలమేశ్వర్ ♦ వారు మళ్లీ ప్రవేశ పరీక్ష రాయాలన్న మరో జడ్జి న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన వ్యాపం కేసు నిందితులకు శిక్ష విధింపుపై సుప్రీం కోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో కూడిన తీర్పు ఇచ్చింది. 640 మంది వైద్య విద్యార్థులు ఐదేళ్లు సైన్యంలో ఎలాంటి ప్రతిఫలమూ లేకుండా పని చేయాలని జస్టిస్ జె.చలమేశ్వర్ పేర్కొనగా, వారంతా మళ్లీ వైద్య కోర్సు ప్రవేశ పరీక్ష రాయాలని మరో జడ్జి జస్టిస్ సప్రే స్పష్టం చేశారు. 2008-13 మధ్య జరిగిన మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు(వ్యాపం) ఫలితాలను రద్దు చేసిన హైకోర్టు తీర్పులపై నిందితుల పిటిషన్‌ను సుప్రీం బెంచ్ విచారించి సోమవారం ఈ తీర్పు ప్రకటించింది. భిన్నాభిప్రాయాల వల్ల దీన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు నివేదించారు. తప్పు చేసినవారి నుంచి సమాజం ఏదోరకంగా పరిహారం అందుకోవాలని జస్టిస్ చలమేశ్వర్ పేర్కొన్నారు. నిందితులు ఆర్మీలో ఐదేళ్లు పనిచేశాకే సర్టిఫికెట్ ఇవ్వాలని సూచించారు.