సీజేఐగా జస్టిస్ దత్తు ప్రమాణం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హంద్యాల లక్ష్మీనారాయణ స్వామి దత్తు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో దత్తుతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆర్.ఎం.లోధా ఈ నెల 27 పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ దత్తు బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో 2015 డిసెంబర్ 2 వరకు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి అన్సారీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్ నేత అద్వానీ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓ సామాన్యుడిగానే బెంచ్(ధర్మాసనం)పై కూర్చుంటానని జస్టిస్ దత్తు చెప్పారు.
సుప్రీం కోర్టులో కేసుల విచారణ సందర్భంగా భిన్న వర్గాల మధ్య ఎలాంటి వ్యత్యాసం ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తిగా తన పనితీరు ఎలా ఉండబోతోందో పరోక్షంగా స్పష్టం చేశారు. సీజేఐగా ప్రమాణం తర్వాత ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. జడ్జిలు రోజుకు 16 గంటలు పనిచేయాలన్నారు. జస్టిస్ దత్తు 1950 లో కర్ణాటకలోని హందిహళ్లో జన్మించారు. 1975లో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, పన్నులు, రాజ్యాంగ కేసులను వాదించారు. 1983 నుంచి కర్ణాటక హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 1995లో కర్ణాటక హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత ఛత్తీస్‌గఢ్, కేరళ హైకోర్టులకు చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2007లో సుప్రీం జడ్జిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన కేసులను విచారించిన సుప్రీం బెంచ్‌కు ఆయనే నేతృత్వం వహించారు.