ఇది చాలా సీరియస్ అంశం..
న్యూఢిల్లీ: రైతు ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్నదాతల బలవన్మరణాలు చాలా తీవ్రమైన అంశమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. రైతులు ఎందుకు ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకోవాలని సూచించింది. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని రైతుల సమస్యలను పరిష్కరించాలని సూచించింది. ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
'ఇది చాలా సీరియస్ అంశం. అన్నదాతల ఆత్మహత్యల నివారణకు రాష్ట్రాలు ఎటువంటి చర్యలు చేపట్టబోతున్నాయో తెలుపుతూ నాలుగు వారాల్లో సవిరమైన సమాధానం ఇవ్వాలి. వ్యవసాయ రంగం రాష్ట్రాలకు సంబంధించిన అంశం. రాష్ట్రాల భాగస్వామ్యంతో రైతుల బలవన్మరణాలకు గల ప్రధాన కారణాలు గుర్తించి, సమస్య పరిష్కరించాల'ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని బెంచ్ కేంద్రాన్ని ఆదేశించింది. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ పీఎస్ నరసింహ తెలిపారు. విత్తనాలు నేరుగా రైతులకు అందజేస్తోందని, బీమా, రుణాల మంజూరు, పంట నష్టపరిహారం పెంచిందని వివరించారు.